గల్లీ ర్యాపర్
రెండేండ్ల కిందట వచ్చిన ‘గల్లీబాయ్’ సినిమాలోని హీరోలాంటి కథే ఈ అమ్మాయిది. ముంబైలో ‘గోవండి’ లోని మురికి వాడల్లో ఉండే సానియా మిస్త్రీది పేదకుటుంబం. పేదవాళ్ల బతుకుచిత్రాన్ని ర్యాప్ చేస్తోంది.పేదరికంలో మగ్గుతూ, మూడుపూటలా తిండికోసం తిప్పలు పడుతున్న లక్షలమందిని చూసింది. తన ఈడు ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులు చాలా దగ్గరగా గమనించింది. ఇవే ఆమె ర్యాప్ పాటలకి మూలం. సొసైటీలో ఉన్న తేడాలను ర్యాప్ సాంగ్స్‌గా పాడుతూ ఆకట్టుకుంటోంది సానియా.
ఆ ఛాలెంజ్‌తో మొదలు
సానియా తండ్రి రిక్షా నడుపుతాడు. అమ్మ ఇండ్లల్లో పనిచేస్తుంటుంది. ఎనిమిదేండ్ల వయసు నుంచే పాటలు పాడేది సానియా. ఆమె ర్యాపర్ అవడానికి కారణం ఫ్రెండ్స్. ఒకరోజు స్కూల్లో ఆమె ఫ్రెండ్స్ ‘నువ్వు ర్యాప్ సాంగ్స్ పాడగలవా?’ అని ఛాలెంజ్ విసిరారు. క్రియేటివ్‌గా ఆలోచించే సానియా వాళ్ల ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ర్యాప్ పాటలు పాడడం మొదలెట్టింది. ఇప్పుడు సానియాకి పదిహేనేండ్లు. ఆమె దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు. ఫ్రెండ్స్ ఫోన్లో ర్యాప్ పాటల్ని రికార్డు చేసి, తన యూట్యూబ్ ఛానెల్ (సానియా ఎంక్యూ)లో పెడుతుంది. ఆమె ఛానెల్‌కి 3వేల మందికిపైగా సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.. ‘ఫ్యూచర్ కా క్యా’, ‘జాన్తా హై కౌన్’, ‘భ్రమ్’, ‘బహోత్ ధీట్’ వంటి పాటలు ర్యాపర్‌గా మంచి పేరు తెచ్చాయి ఆమెకు.
అదే నా డ్రీమ్
‘‘మావాళ్లకి ర్యాప్ అంటే తెలియదు. అందుకని ర్యాప్ ఎలా పాడతారో? ర్యాపింగ్ అంటే నాకెంత ఇష్టమో? వాళ్లకి చెప్పాను. మొదట్లో మా పేరెంట్స్ ‘నువ్వు అమ్మాయివి. గిన్నెలు తోమడం తప్ప. వేరే పనులు చేయలేవు. నువ్వు చదువుకున్నా ఏం లాభం ఉండదు’ అనేవాళ్లు. వాళ్లలా అనడం నాకు నచ్చేది కాదు. ‘ఆడపిల్లలు అన్ని విషయాల్లో మగపిల్లల కంటే తక్కువని ఎందుకు అనుకుంటారు?’ అని అడిగేదాన్ని. అలా నాకు తప్పనిపించిన ప్రతి అంశాన్ని ర్యాప్ చేయడం అలవాటైపోయింది. అమ్మ కూడా నన్ను అర్థం చేసుకుంది. మా టీచర్లు సపోర్ట్ చేయడంతో ర్యాపింగ్ కంటిన్యూ చేస్తున్నా. ర్యాపర్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా డ్రీమ్” అంటున్న సానియాకి ఇన్స్పిరేషన్... బెంగళూరుకు చెందిన పాపులర్ ర్యాపర్ ఎమివే బన్తాయ్.
