హైదరాబాద్ లో రియల్ ప్రాజెక్టుల జోరు 

హైదరాబాద్ లో రియల్ ప్రాజెక్టుల జోరు 
  • కరోనా, లేబర్ ​షార్టేజీ, రిజిస్ట్రేషన్ల ఇక్కట్లు పోవడంతో ట్రాక్​ మీదికి వచ్చిన మార్కెట్​
  • ఆఫర్లతో ఆకట్టుకుంటున్న కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టు లాంచింగ్ కంటే ముందే ఫ్లాట్లను బుక్ చేసుకునే స్థాయిలో ప్రస్తుతం హైదరాబాద్​ చుట్టుముట్టూ రియల్​ ఎస్టేట్​ హవా నడుస్తోంది. చాలా చోట్ల విల్లాలు, అపార్ట్​మెంట్లు, ఇండిపెండెంట్​ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పోస్ట్​ కొవిడ్​ టైంలో రియల్  మార్కెట్  పెద్దగా ఉండదని అంతా భావించారు. అయితే.. ప్రస్తుతం బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను లాంచ్​ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన బిల్డర్లు కన్​స్ట్రక్షన్స్​ పనులు మొదలు పెట్టారు. ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రీ లాంచింగ్ ఆఫర్లు, 50 పర్సెంట్ పేమెంట్ మోడ్ లలో ప్రాపర్టీలను అమ్ముతున్నారు. జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని రియల్టర్లు చెప్తున్నారు.ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 5 వేల నుంచి 7 వేల మధ్య ధర ఉంది.

జూన్‌ నాటికి 18 వేల యూనిట్లు

జూన్ నాటికి హైదరాబాద్​ రియల్ మార్కెట్ లోకి కొత్తగా 18 వేల యానిట్లు (ఫ్లాట్లు) అందుబాటులోకి వస్తాయని రియల్ ఎస్టేట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఇండిపెండెంట్, విల్లా, అపార్టుమెంట్లు ఉండనున్నాయి. ఇప్పటికే అనుమతులు పూర్తి చేసుకుని, నిర్మాణ పనులు మొదలయ్యాయి. అందుబాటులో ఉన్న లేబర్​తో ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేసి మార్కెట్ లోకి తీసుకువచ్చేలా కంపెనీలు చూస్తున్నాయి. ముఖ్యంగా సిటీ శివారుల్లో శరవేగంగా కన్​ స్ట్రక్షన్ పనులు స్టార్ట్ కావడంతో, ప్రస్తుతం మార్కెట్ ధరలను బట్టి సేల్స్ కూడా స్టార్ట్ చేశారు. చెన్నైకి  చెందిన నిర్మాణ రంగ సంస్థ నార్సింగిలో హైరైజ్ బిల్డింగ్ లో 400 ప్లాట్లను మార్కెట్ లోకి తీసుకురాగా.. తాజాగా మరో లోకల్ కంపెనీ కూడా వచ్చే నెలలో 210 ఫ్లాట్లతో ప్రాజెక్టును లాంచ్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో ప్రీ లాంచింగ్ పేరిట చేసిన మార్కెటింగ్ తో 10 శాతం ఫ్లాట్లకు బుకింగ్స్ జరిగినట్లుగా తెలిసింది.

గత ఏడాదంతా ఆగమాగం

గత ఏడాది కరోనా ఎఫెక్ట్​, లేబర్​ షార్టేజీ, రవాణా ఆంక్షలు, రిజిస్ట్రేషన్లలో సమస్యల వల్ల రియల్​ ఎస్టేట్​ బాగా దెబ్బతింది. ఎక్కడికక్కడ కన్​స్ట్రక్షన్లు ఆగిపోయాయి. ఫ్లాట్లను బుక్​ చేసుకునేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్​ చూపలేదు. దీంతో దాదాపు ఏడాది వరకు ఎక్కడిక్కడా నిర్మాణ పనులు, క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఉన్న ఇన్వెంటరీ అంతా ఖాళీ చేసుకునే పనిలో ఉన్నా బిల్డర్లు.. తాజాగా కొత్త ప్రాజెక్టులను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్​ తగ్గడం, లేబర్​ షార్టేజీ సమస్య కూడా పెద్దగా లేకపోవడంతో పనులు మొదలు పెట్టారు. ఏడాదికి ముందుతో పోలిస్తే ప్రస్తుతం కాస్త మార్కెట్​ తక్కువగానే ఉన్నప్పటికీ ఇది బెటరేనని రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అంటున్నారు.

ధరలపై బిల్డర్ల డైలామా!

ధరలు పెరిగిపోవడంతో ఫ్లాట్ల రేట్లు పెంచాల్సి ఉంటుందని బిల్డర్లు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచితే కస్టమర్లు వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. దీంతో ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రాజెక్టును చదరపు అడుగుకు రూ. 5 వేల లోపు ధరతో లాంచ్​ చేసి, ప్రాజెక్టులోని 30- నుంచి 40 శాతం ఫ్లాట్లను ముందే అమ్మేస్తున్నారు. ప్రాజెక్టు హ్యాండోవర్ నాటికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర కంటే ఎక్కువ ప్రాపిట్ పొందవచ్చని కస్టమర్లకు వివరిస్తున్నారు.

నెలల్లో 18 వేల యూనిట్లు రెడీ

హైదరాబాద్​లో దాదాపు ఏడాదిపాటు కరోనా, రిజిస్ట్రేషన్ల సమస్యలతో ఆగిపోయిన కన్​స్ట్రక్షన్​ యాక్టివిటీ ఇప్పుడు  ట్రాక్​మీదికి వచ్చింది. రెసిడెన్షియల్​ రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. కొన్ని కాలనీలకు వెళ్తే ఇండిపెండెంట్‌‌ ఇండ్లు పోయి అపార్ట్‌‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రానున్న ఐదునెలల్లో 18 వేల రెసిడెన్షియల్​ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.

రూ.15 కోట్ల విల్లాలు 10 రోజుల్లో 25 సేల్

హైదరాబాద్​లో అదో పెద్ద కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీ. లాక్‌‌డౌన్‌‌లో ప్రాజెక్టులన్నీ పక్కన బెట్టిన ఆ కంపెనీ.. ఈ మధ్య సిటీ శివారులోని మంచిరేవుల వద్ద ఒక ప్రాజెక్ట్‌‌  లాంచ్​ చేసింది. ఒక్కో విల్లా ఖరీదు రూ. 15 కోట్లు. 30 విల్లాలు ప్లాన్‌‌  చేస్తే.. లాంచింగ్​రోజే పది బుక్కయ్యాయి. మరో పది రోజుల్లో మరికొన్ని బుక్కయ్యాయి. ప్రస్తుతం మిగిలినవి నాలుగైదే.

15 రోజుల్లో 100 ఫ్లాట్లు

చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్​ శివారులోని అమీన్ పూర్ పరిసరాల్లో ఒక భారీ ప్రాజెక్టును లాంచ్​ చేసింది. ఐదెకరాల విస్తీర్ణంలో మూడు వందల ఫ్లాట్లతో అపార్ట్‌‌మెంట్‌‌ అది. ప్రీ లాంచింగ్‌‌ ఆఫర్‌‌  పేరిట ఒక వంద ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. పదిహేను రోజుల్లో హాట్‌‌ కేకుల్లా అన్నీ సేల్‌‌ అయ్యాయి.

మార్కెట్ పుంజుకుంది

ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్​ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. కరోనాతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా.. చాలా ఫాస్ట్ గా రికవరీ అయింది. నిర్మాణ పనులు పుంజుకోవడం, ప్రాజెక్టుల లాంచింగ్స్​ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రం హోం మోడ్ తో మార్కెట్ పై ప్రభావం పడినా.. అది తాత్కాలికమే. ఇన్వెస్ట్ మెంట్, రెంటల్ ఇన్ కం ఆశించేవారు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయార్టీ ఇస్తున్నారు.

– జి. రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్

ఆఫర్లు బాగున్నయ్..

కొంతకాలంగా ఫ్లాట్  కొందామని ట్రై చేస్తున్న. కరోనా ఎఫెక్ట్​తో కన్ స్ట్రక్షన్స్​ ఆగిపోవడంతో హ్యాండోవర్ డిలే అవుతుందని ఆ ఆలోచన మానుకున్న. కానీ ఇప్పుడు  మార్కెట్ లోకి కొత్త ప్రాజెక్టులు వస్తున్నయ్. రేట్లు పెరిగినట్లు చెప్తున్నా.. అది ఎంత వరకు వాస్తవమనేది అడ్వాన్స్ కట్టేప్పుడు మాత్రమే తెలుస్తుంది. బిల్డర్లు కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా ఆఫర్లతో ప్రాజెక్టులను లాంచ్​ చేస్తున్నరు.

– అవినాష్​, హైదరాబాద్