- ఎన్పీడీసీఎల్ పరిధిలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం అమలు
- 16 సర్కిళ్లలోని 133 సబ్‌స్టేషన్లలో ఏర్పాటు
- వరంగల్ విద్యుత్ భవన్‌లో ప్రత్యేక స్కాడా సెంటర్
- విద్యుత్ సరఫరాలో అంతరాయానికి చెక్
వరంగల్, వెలుగు : విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఎన్‌పీడీసీఎల్ అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. పవర్ కట్ జరిగినా, ఓవర్ లోడ్ అయినా క్షణాల్లోనే చెప్పేసే రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్‍టీఎఫ్‍ఎంఎస్)ను అమలు చేస్తోంది. ఇప్పటికే ఐదు సబ్‌స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసిన ఎన్‌పీడీసీఎల్.. మరో 133 సబ్‌స్టేషన్లలోనూ అమలుకు చర్యలు చేపట్టింది.
సమస్య ఎక్కడో క్షణాల్లోనే సమాచారం
సాధారణంగా ఈదురుగాలులు, అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు సాంకేతిక కారణాల వల్ల బ్రేక్‌డౌన్ అయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంటుంది. బ్రేక్ డౌన్ జరిగిన టైంలో సమస్యను గుర్తించడం విద్యుత్ ఆఫీసర్లు, సిబ్బందికి సవాల్‌గా మారేది. లైన్ మొత్తాన్ని తనిఖీ చేస్తే గానీ సమస్య ఎక్కడో తెలిసేది కాదు. సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతుండడంతో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి.
కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్‌కు 33 కేవీ, 11 కేవీ లైన్లలోని 2,500 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను అనుసంధానం చేశారు. వీటి ద్వారా విద్యుత్ సేవల్లో ఏర్పడే అంతరాయంతో పాటు సమస్య ఎక్కడ ఉందన్న సమాచారాన్ని సైతం కంట్రోల్‌రూంకు చేరవేస్తుంది.
వరంగల్లోని..‘స్కాడా’ కేంద్రం
ఎన్‍పీడీసీఎల్ పరిధిలో అమలుచేస్తున్న రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టంను గ్రేటర్ వరంగల్‌లోని విద్యుత్ భవన్ కేంద్రంగా ఆపరేట్ చేయనున్నారు. ఇందుకోసం ఇక్కడ ‘సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్’ (స్కాడా)పనిచేయనుంది. 133 సబ్‌స్టేషన్ల పరిధిలోని లైన్లలో ఏర్పాటు చేసిన ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు తమ పరిధిలో విద్యుత్ సమస్యలు, బ్రేక్ డౌన్ల కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి స్కాడా సెంటర్‌కు చేరవేస్తాయి. ఇక్కడ 24 గంటలు డ్యూటీల్లో ఉండే సిబ్బంది.. ఇండికేటర్ల నుంచి వచ్చి సమాచారాన్ని వెంటనే ఫీల్డ్ సిబ్బందికి చేరవేస్తారు. దీంతో సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించి లైన్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది.
133 సబ్‌స్టేషన్లలో అమలు
ఆర్‍టీఎఫ్‍ఎంఎస్ వ్యవస్థను ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఐదు సబ్‌స్టేషన్లలో గతంలోనే ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో 16 సర్కిళ్ల పరిధిలోని 133 సబ్‌స్టేషన్లకు సైతం ఈ వ్యవస్థను అనుసంధానం చేశారు. త్వరలోనే మిగతా అన్ని సబ్‌స్టేషన్లలోనూ అమలు చేయనున్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఆఫీసర్లు తెలిపారు.
ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌తో నాణ్యమైన సేవలు
ఎన్‍పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికే అత్యాధునిక ‘రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం’ అమలుచేస్తున్నాం. దీని వల్ల సమస్యను త్వరగా పరిష్కరించి, విద్యుత్ సేవల్లో అంతరాయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. రాబోయే 15 ఏండ్లకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. ఎన్‍పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఈ టెక్నాలజీ అమలుచేస్తున్నాం.
– కర్నాటి వరుణ్‍రెడ్డి, ఎన్‍పీడీసీఎల్ సీఎండీ
