కోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్, రైతుల ఆందోళన

కోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్,  రైతుల ఆందోళన

కోదాడ, వెలుగు: తాను రియల్  ఎస్టేట్  వ్యాపారం  చేస్తున్నానని పెట్టుబడి కోసం డబ్బులు కావాలని చెప్పి, ఆ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి 60 మంది రైతుల నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన రియల్టర్​ కనిపించకుండా పోయాడు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురానికి చెందిన జితేందర్ రెడ్డి కొన్నేండ్లుగా రియల్  ఎస్టేట్  వ్యాపారం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో తాను కొత్తగా వెంచర్  పెడుతున్నానని చెప్పి గ్రామంలోని కొందరు రైతులను అడిగాడు. ఆ పైసలకు అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించడంతో గ్రామానికి చెందిన 60 మంది రైతులు అతడికి రూ.11 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఈక్రమంలో జితేందర్​రెడ్డి కొన్ని రోజులుగా గ్రామంలో కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

అలాగే తన వద్ద ఎలాంటి ఆస్తులు, డబ్బులు లేవని కోర్టులో ఐపీ పిటిషన్  దాఖలు చేయడంతో రైతులకు నోటీసులు వచ్చాయి. దీంతో మంగళవారం రైతులంతా కలిసి జితేందర్ రెడ్డి ఇంటి వద్ద ధర్నాకు దిగారు. తమ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్  చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విషయం కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించడంతో చేసేదేమీ లేక ఆందోళన విరమించారు.