
స్టవ్ వెలిగించకుండా, ఒవెన్ వాడకుండా, చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ కొన్ని ఉన్నాయి తెలుసా! అవెలా చేయాలో మేం చెప్తామని... పిల్లలు చెప్పిన యమ్మీ.. ఈజీ.. శ్నాక్స్ & స్వీట్స్ ఇవి...
పోహా లడ్డు
కావాల్సినవి :
పోహా (నానబెట్టి) – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పు, యాలకుల పొడి – అర టీస్పూన్, కర్జూరాలు (గింజలు తీసి) – పది, పల్లీల పొడి – పావు కప్పు, తేనె – కొంచెం
తయారీ :
పల్లీలు నూనె లేకుండా వేగించాలి. మిక్సీలో వేసి పొడి చేయాలి. ఒక గిన్నెలో నానబెట్టి, వడకట్టిన పోహా (అటుకులు), బెల్లం పొడి, యాలకుల పొడి, కర్జూరాలు, పల్లీల పొడి వేసి కలపాలి. కావాలంటే తేనె కూడా కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేస్తే పోహా లడ్డు రెడీ.
స్విస్ రోల్
కావాల్సినవి :
మ్యారీ బిస్కెట్స్ పొడి – పావు కిలో
కాఫీ పొడి – ఒక టీస్పూన్
చాకొలెట్ సిరప్ – పావు కప్పు
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి – అర కప్పు
చక్కెర పొడి – పావు కప్పు
యాలకుల పొడి – పావు టీస్పూన్
వెన్న – ఒక టేబుల్ స్పూన్
పాలు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
ఒక గిన్నెలో మ్యారీ బిస్కెట్స్ పొడి, కాఫీ పొడి, చాకొలెట్ సిరప్, నెయ్యి వేసి ముద్దలా కలపాలి. మరో గిన్నెలో కొబ్బరి పొడి, చక్కెర పొడి, యాలకుల పొడి, వెన్న వేసి, పాలు పోసి కలపాలి. ఒక పాలిథీన్ కవర్ మీద బిస్కెట్ మిశ్రమం ముద్దను పెట్టి చపాతీ కర్రతో ఒత్తాలి. అందులో కొబ్బరి మిశ్రమాన్ని పూసి, రోల్ చేయాలి. ఆ రోల్‌ని నాలుగు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి, చాకుతో కట్ చేయాలి.
బిస్కెట్ శాండ్ విచ్
కావాల్సినవి :
బిస్కెట్స్ – కొన్ని, ఆలుగడ్డలు (ఉడికించి) – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి
టొమాటో – ఒకటి, పచ్చిమిర్చి – ఒకటి
అల్లం – చిన్న ముక్క, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – సరిపడా
చాట్ మసాలా – అర టీస్పూన్
గ్రీన్ చట్నీ – రెండు టీస్పూన్లు
టొమాటో కెచెప్ – కొంచెం
సన్న కారప్పూస (బుజియా) – పావు కప్పు
తయారీ :
ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డల్ని వేసి, మెదపాలి. అందులో ఉల్లిగడ్డ, టొమాటో తరుగు వేయాలి. పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచి కలపాలి. కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ కూడా కలిపి, ఉండలు చేయాలి. వాటిని రెండు బిస్కెట్ల మధ్యలో పెట్టాలి. దాని చుట్టూ టొమాటో కెచెప్ పూయాలి. దానికి సన్న కారప్పూస అద్దాలి. డెకరేషన్ కోసం బిస్కెట్ పైన టొమాటో కెచెప్తో గార్నిష్ చేస్తే యమ్మీ యమ్మీ బిస్కెట్ శాండ్ విచ్ రెడీ.
నోట్ : ఆలుగడ్డల్ని ఉడికించి పిల్లలకు ఇవ్వాలి.
యాపిల్ పేడా
కావాల్సినవి :
నెయ్యి – నాలుగు టీస్పూన్లు
చక్కెర పొడి – పావు కప్పు
పుట్నాలు – ఒక కప్పు
పాలు – రెండు టీస్పూన్లు
లవంగాలు – కొన్ని
తయారీ :
ఒక గిన్నెలో చక్కెర పొడి, టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి. మిక్సీజార్‌లో పుట్నాలు వేసి పొడి చేయాలి. ఆ పొడిని కూడా మిశ్రమంలో కలపాలి. అందులో మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత పాలు పోసి ముద్దలా కలపాలి. తరువాత ఉండలు చేయాలి. వాటి పైన యాపిల్‌లా లోపలికి నొక్కి, లవంగం పెట్టి డెకరేట్ చేస్తే యాపిల్ పేడా రెడీ.
పుట్నాల మోదక్
కావాల్సినవి :
పుట్నాలు – ఒక కప్పు
బెల్లం – అర కప్పు
కొబ్బరి పొడి – అర కప్పు
ఎండు ద్రాక్షలు – కొన్ని
తయారీ :
మిక్సీ జార్లో పుట్నాలు వేసి, పొడి చేయాలి. తర్వాత అందులోనే బెల్లం, కొబ్బరి పొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పిండిని కొంచెం అరచేతిలోకి తీసుకుని, ఎండుద్రాక్ష పెట్టి ఉండ చేసి తింటే టేస్టీగా ఉంటుంది. వెరైటీ ఆకారంలో చేయాలనుకుంటే మోదక్ షేప్‌లో చేసుకోవచ్చు. ఇవి హెల్త్‌కి చాలా మేలు చేస్తాయి.
అరటి చాట్
కావాల్సినవి :
అరటి పండ్లు – రెండు, మిరియాల పొడి – అర టీస్పూన్, టొమాటో కెచెప్ – అర టీస్పూన్, కార్న్ ఫ్లేక్స్ – అర కప్పు, టొమాటో – ఒకటి, ఉల్లిగడ్డ – ఒకటి, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – సరిపడా
తయారీ : అరటి పండ్లను ముక్కలుగా తరగాలి. ఒక ప్లేట్లో అరటి పండు ముక్కల మీద మిరియాల పొడి చల్లాలి. తర్వాత టొమాటో కెచెప్ వేయాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లేక్స్ వేసి నలపాలి. అందులో టొమాటో, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో అరటి పండు ముక్కల్ని కూడా వేసి కలపాలి. కావాలంటే దానిమ్మ గింజలు కూడా వేయొచ్చు.