పోలీసుల బదిలీల్లో రికమండేషన్లు పెరుగుతున్నయ్​ : పద్మనాభరెడ్డి

పోలీసుల బదిలీల్లో రికమండేషన్లు పెరుగుతున్నయ్​ :  పద్మనాభరెడ్డి
  • ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే బదిలీ
  • పీఎస్​ను బట్టి కోట్లలో లంచాలు
  • డీజీపీకి ఎఫ్​జీజీ ఫిర్యాదు


హైదరాబాద్, వెలుగు: పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యే రికమండేషన్ లెటర్లు పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్​జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే లెటర్లు లేనిదే బదిలీ జరగటం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి బదిలీలను రద్దు చేయాలని డీజీపీ అంజనీకుమార్ కు బుధవారం లేఖ రాశారు.  పోలీస్ స్టేషన్లను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారని, ఎమ్మెల్యేలకు కోట్ల రుపాయలు ఇస్తూ పోస్టింగ్ లు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలా పోస్టింగ్ తెచ్చుకున్నవాళ్లు డ్యూటీ కరెక్ట్ గా చేస్తారని నమ్మకం లేదన్నారు. 

ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియోజకవర్గంలోని పీఎస్ లకు పోస్టింగ్ ఇప్పించి తెచ్చుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై 500కు పైగా కేసులు ఉన్నాయని, వీటిని ప్రత్యేక కోర్టు విచారించిందని వెల్లడించారు. అయితే కేవలం 8 కేసులకు మాత్రమే ఫైన్ విధించారని పద్మనాభరెడ్డి  తెలిపారు. ఆధారాలు లేవని కేసులు కొట్టివేస్తున్నారని, నేతలకు అనుకూలంగా ఉన్న పోలీసులు ఆధారాలు కోర్టుకు అందజేయరన్నారు. కమిషనర్లు, డీఐజీ ఆఫీసుల్లో చాలా రికమండేషన్ లెటర్లు ఉన్నాయని వాటిపై విచారణ జరిపించాలని పద్మనాభరెడ్డి కోరారు.