ప్రజలకు డబ్బులు నేరుగా చేరేలా చూడండి: రాహుల్‌ గాంధీ

ప్రజలకు డబ్బులు నేరుగా చేరేలా చూడండి: రాహుల్‌ గాంధీ
  • ఆర్థిక ప్యాకేజ్‌పై కేంద్రానికి రాహుల్‌ సూచన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్రానికి సూచనలు చేశారు. ప్రజలకు నగదు అవసరం చాలా ఉందని, నేరుగా వారి ఖాతాల్లోకి జమ అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవాల్సి ఉందన్నారు. జూమ్‌ వీడియో కాల్‌ ద్వారా విలేకరులతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ ఈ సూచనలు చేశారు. “ ప్రజలకు డబ్బులు కావాలి. ఆర్థిక ప్యాకేజ్‌ను రీకన్సిడర్‌‌ చేయండి. ఎమ్‌ఎన్‌ఆర్‌‌ఈజీఏ కింద 200 పనిదినాలను కల్పించండి. వాళ్లే మన దేశ భవిష్యత్తు” అని రాహుల్‌ గాంధీ చెప్పారు. లక్షల మంది కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్నారని, మార్గ మధ్యలో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్నారులు రోడ్లపై నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు కావాల్సిన డబ్బు అని నేరుగా వాళ్ల జేబుల్లోకి డబ్బు వెళ్లేలా చేయాలని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన న్యాయ్‌ యోజనను గుర్తుచేశారు. ఆ రకంగా ముందుకు వెళ్తే ప్రతిఒక్కరికి మంచి జరుగుతుందని అన్నారు.