ధాన్యం కొనుగోళ్లలో రికార్డు.. మూడు రోజుల్లోనే రూ.10 వేల 355 కోట్లు చెల్లింపులు

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు.. మూడు రోజుల్లోనే రూ.10 వేల 355 కోట్లు చెల్లింపులు
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడ్రోజుల్లోనే  రైతులకు డబ్బులు చెల్లించింది. ఇప్పటి వరకు 8,35,109 మంది రైతులకు రూ.10,355.18 కోట్లు చెల్లింపులు చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం  మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచింది.

 వీటిలో 6,345 కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపింది. చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, మరో పది రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని సివిల సప్లైస్ విభాగం అంచనా వేసింది.  ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా.. ఈ నెలాఖరు వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.

 ఈ సారి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.