చండీగఢ్: మనదేశం 2025–26 గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.82.24 లక్షల కోట్ల (863 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులు సాధించిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 2014–-15లో రూ.44.59 లక్షల కోట్లుగా ఉన్న భారత మొత్తం ఎగుమతులు 2025–-26 నాటికి రూ.82.24 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరాయి.
ఈ కాలంలో వార్షిక వృద్ధి రేటు 5.7 శాతంగా నమోదైంది. ఇందులో మర్చండైజ్ ఎగుమతులు 310 బిలియన్ డాలర్ల నుంచి 442 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సేవల ఎగుమతులు 9.3 శాతం వృద్ధి రేటుతో 158 బిలియన్ డాలర్ల నుంచి 421 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఈయూ ఎఫ్‌టీఏ ఒప్పందం ద్వారా 100 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతేగాక 98 శాతం ఎగుమతులకు సుంకం ఉండదు. ఇండియా– ఈయూ ఎఫ్‌టీఏ ద్వారా రూ. 3.2 లక్షల కోట్ల విలువైన భారత ఎగుమతులకు లబ్ధి చేకూరుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, బాస్మతి బియ్యం, డైరీ ఉత్పత్తుల రంగాలలో మంచి ఎగుమతి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
