రిమాండ్‌‌‌‌కు ఆదేశించే ముందు రికార్డులు పరిశీలించాలి

రిమాండ్‌‌‌‌కు ఆదేశించే ముందు రికార్డులు పరిశీలించాలి
  • యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు
  • మేజిస్ట్రేట్‌‌‌‌లకు హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు: క్రిమినల్‌‌‌‌  కేసుల్లో రిమాండ్‌‌‌‌కు ఆదేశించే ముందు రికార్డులను పరిశీలించాలని మేజిస్ట్రేట్‌‌‌‌  కోర్టులకు హైకోర్టు సూచించింది. పోలీసులు సమర్పించిన రికార్డులను పరిశీలించకుండా, తగిన కారణాలు పేర్కొనకుండా నిందితులను యాంత్రికంగా రిమాండ్‌‌‌‌కు ఆదేశించరాదని పేర్కొంది.

 నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్‌‌‌‌కు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ మలక్‌‌‌‌పేట పోలీసు స్టేషన్‌‌‌‌లో నమోదైన కేసులో 6వ నిందితుడైన దస్తగిరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశాడు.. దీనిని జడ్జి జస్టిస్‌‌‌‌  ఎన్‌‌‌‌.తుకారాంజీ మంగళవారం విచారించారు.. నిందితుడిని రిమాండ్‌‌‌‌కు పంపిన తీరును తప్పుబట్టారు. 

రిమాండ్‌‌‌‌కు విధించే ముందు మేజిస్ట్రేట్‌‌‌‌లు న్యాయాధికారిగా ఆలోచించాలని, కార్యనిర్వహణ అధికారిగా ఆలోచించి ఉత్తర్వులు జారీ చేయరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రిమాండ్‌‌‌‌ అవసరమన్న పోలీసుల అభ్యర్థన సరైనదనిపిస్తే దానికి కారణాలను పేర్కొనాలని సూచించారు. 

ప్రస్తుత కేసులో పిటిషనర్‌‌‌‌ను జులై 7న 10.15 గంటలకు అరెస్టు చేసి తర్వాతి రోజు 11.35 గంటలకు పోలీసులు కోర్టులో హాజరుపరిచారన్నారు. 24 గంటలు దాటిన తరువాత 1.20 గంటల ఆలస్యంగా హాజరుపరచడంతోపాటు రిమాండ్‌‌‌‌కు పోలీసులు పేర్కొన్న కారణాలు సంతృప్తికరంగా లేకపోయినా మేజిస్ట్రేట్‌‌‌‌ రిమాండ్‌‌‌‌కు ఆదేశించడం చెల్లదన్నారు. 

రిమాండ్‌‌‌‌  ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితుడిని తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌‌‌‌తోపాటు అంతేమొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని నిందితుడిని ఆదేశించారు.