తిరుపతి జిల్లాలో ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్ .. 275 దుంగలు స్వాధీనం, ఐదుగురు అరెస్ట్

తిరుపతి  జిల్లాలో ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్ .. 275 దుంగలు స్వాధీనం, ఐదుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా జరుగుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. నిత్యం ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి  జిల్లాలో వీరి ఆగడాలకు అడ్డు కట్ట వెయ్యటం పోలీసులకు, టాస్క్ ఫోర్స్ అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో తమిళనాడుకు చెందిన ఐదుగురు  ఎర్రచందనం స్మగ్లర్ లను అదుపులోకి తీసుకున్నారు. 

తిరుపతి  జిల్లా తడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ( నవంబర్ 5) పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతి నుంచి తమిళనాడుకు వేగంగా వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసి  4.49 కోట్ల రుపాయుల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు.  మరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న  275 ఎర్ర చందనం దుంగలు, రెండు కార్లు, రూ. 3200,  6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనకున్న పెద్ద స్మగ్లర్ల కోసం గాలింపు చేపడుతున్నామని తిరుపతి ఎస్పీ తెలిపారు.  ఈ  పరిసర ప్రాంతాలలో స్మగ్లర్లకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కూడా గుర్తించి అరెస్టు చేయడం చేసి ఈ స్మగ్లర్ల నెట్వర్క్ ను పూర్తిగా చేదించి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికడతామన్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ ప్రశంసించారు.