గజ్వేల్​లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ఫాయిదా?

గజ్వేల్​లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ఫాయిదా?

సిద్దిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో ఫలితం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్నది. దాదాపు 5(4.9) శాతం పోలింగ్ తగ్గడం సీఎం కేసీఆర్ గెలుపు లేదా మెజార్టీ పై ప్రభావం చూపుతుందా అనే చర్చ ప్రారంభమైంది.  నువ్వా నేనా అన్నట్టుగా సాగిన గజ్వేల్​లో సీఎం కేసీఆర్ తో  బీజెపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. గజ్వేల్​లో వార్ వన్ సైడ్ అవుతుందని అందరూ భావించినా.. అనూహ్యంగా బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలోకి దిగడంతో చివరి వరకు పోటా పోటీగా పోలింగ్​సాగింది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్​తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 58,290 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  

2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ పడగా బీజేపీ అభ్యర్థి నామమాత్రానికే పరిమితం కాగా పొలైన ఓట్లలో లక్షకు పైగా కేసీఆర్ సాధించడం విశేషం.  కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పోటీ ఇవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రానికే పరిమితమైనట్లు తెలుస్తున్నది. గురువారం జరిగిన పోలింగ్ లో గజ్వేల్ నియోజకవర్గంలో  మొత్తం 2,74,654 ఓటర్లకు గాను 2,31,086 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు1,15,892 మంది, మహిళలు 1,15,191 మంది ఉండగా 84.14 పోలింగ్ శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో 88.63 శాతం నమోదు కాగా 2023 ఎన్నికల్లో  4.49 శాతం తగ్గింది. 

ఓటర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు..

తగ్గిన పోలింగ్​శాతం గజ్వేల్ లో  సీఎం కేసీఆర్ గెలుపు లేదా మెజార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే 4.9 శాతం తగ్గడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, నిర్వాసితులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని భావస్తుండటంతో గత ఎన్నికల్లో కేసీఆర్​కు 58,290 ఓట్ల మెజార్టీ రాగా ఈసారి మాత్రం బాగా తగ్గే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

మరోవైపు గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల  వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు సంబంధించి దాదాపు పాతిక వేల ఓట్లు ఉండగా ఇవి ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ ల వైపు పడినట్లు అంచనా. నిర్వాసితుల మద్దతు పొందాలని బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేసినా వారు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారనే భావిస్తున్నారు. ముదిరాజ్ లతో పాటు బీసీ ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఈటలకు ఓట్లు వేయడంతో ఆయనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పోలైన ఓట్లను పరిశీలిస్తే దాదాపు నలభై శాతం మేర బీజేపీ అభ్యర్థి వైపు వెళ్లి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. 

రెండు మున్సిపాల్టీల్లో..

గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీల పరిధిలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. ఈ రెండు మున్సిపాల్టీల పరిధిలో  మొత్తం 35 పోలింగ్ బూత్​లుండగా అత్యధికంగా 78.26, అత్యల్పంగా 67.45 శాతం మేర  మాత్రమే పోలింగ్ జరిగింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. రెండు మున్సిపాల్టీల్లోని ఓటర్లు నిర్లిప్తంగా వున్నట్టుగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. రెండు మున్సిపాల్టీల్లో దాదాపు ఆరు నుంచి ఎనిమిది శాతం మేర పోలింగ్ తగ్గడం వల్ల సీఎం కేసీఆర్ మెజార్టీ సాధనకు గండిపడినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.