ఆర్టీసీకి సెకండ్ వేవ్ ఎఫెక్ట్..తగ్గిన డైలీ కలెక్షన్స్

ఆర్టీసీకి సెకండ్ వేవ్ ఎఫెక్ట్..తగ్గిన డైలీ కలెక్షన్స్
  •    రూ.12 నుంచి రూ.8 కోట్లకు పడిపోయిన డైలీ కలెక్షన్స్
  •     ప్యాసింజర్స్‌‌ లేక వెయ్యి బస్సులు తగ్గించిన ఆఫీసర్లు
  •      50 శాతం ఓఆర్ మాత్రమే నమోదు

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది టీఎస్‌‌ ఆర్టీసీ పరిస్థితి. లాక్‌‌డౌన్ నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు కరోనా సెకండ్‌‌ వేవ్‌‌తో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. కరోనా భయంతో బస్సుల్లో ఎక్కేందుకు ప్యాసెంజర్స్​ఇంట్రెస్ట్​చూపకపోవడంతో ఖాళీగా తిరుగుతున్నాయి. దీంతో కలెక్షన్స్​బాగా తగ్గి, ఆదాయం పడిపోయింది. 

1,000 బస్సులు తగ్గించిన్రు!

రాష్ట్రంలో నెల రోజులుగా కరోనా సెకండ్‌‌ వేవ్‌‌తో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో జనం ఆర్టీసీని పెద్దగా ఆదరించడంలేదు. మొత్తం 6,579 బస్సులు ఉండగా, ట్రాఫిక్‌‌ లేకపోవడంతో ఇటీవల వెయ్యి బస్సులను తగ్గించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల లాక్‌‌డౌన్‌‌, ఆంక్షలు విధించడంతో అటువైపు వెళ్లే బస్సుల సంఖ్యనూ తగ్గించారు. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా బంద్‌‌ కావడం కూడా ఆదాయంపై ప్రభావం పడింది. రాష్ట్రంలో ప్రతి రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా, 30 లక్షల వరకు మాత్రమేతిరుగుతున్నాయి. 

రూ.8 కోట్లకు తగ్గిన కలెక్షన్స్

ఇక, ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా తగ్గింది. ఇటీవల 65 శాతం నుంచి 67 శాతం వరకు ఓఆర్‌‌ నమోదుకాగా, ఇప్పుడు ఏకంగా 50 శాతానికి పడిపోయింది. లాక్‌‌డౌన్‌‌ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్టీసీ గాడిన పడే పరిస్థితులు కనిపించాయి. అప్పుడు ఏకంగా సగటున రోజుకు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల కలెక్షన్స్​వచ్చాయి. ప్రస్తుతం బస్సులు, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆటోమెటిక్‌‌గా సంస్థకు కలెక్షన్స్​కూడా తగ్గిపోయాయి. దీంతో రోజువారీ కలెక్షన్​రూ.8 కోట్లకు పడిపోయింది. 

పోయిన ఏడాది రూ.2,400 కోట్ల నష్టం

2020లో కరోనాతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత రోడ్డెక్కినా ప్రయాణికులు ఆదరించలేదు. 2019 డిసెంబర్‌‌లో 85.27 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండగా, 2020 డిసెంబర్‌‌లో 23.76 శాతానికి పడిపోయింది. మొత్తంగా 2020లో కరోనాతో ఆర్టీసీకి రూ.2,400 కోట్ల నష్టం వచ్చినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఇక, ఇప్పుడు రోజురోజుకు కలెక్షన్స్, ఓఆర్‌‌ పడిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. డీజిల్‌‌ రేట్లు పెరిగాయని, జీతాలకు డబ్బులు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. ఆదాయం లేక నెలనెలా సర్కారు నుంచి తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.