V6 News

మీ అభిమానానికి వందనాలు: విమలా గద్దర్

మీ అభిమానానికి వందనాలు: విమలా గద్దర్

హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్‌‌పై అభిమానంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన అభిమానులకు ఆయన భార్య విమలా గద్దర్ కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ మరణం ప్రజలందరికీ ఎంతో బాధకరమని, ఆయనను ప్రేమించే వారు ఈ విషయాన్ని తట్టుకోవడం కష్టమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘గద్దర్‌‌ అకాల మరణం ప్రతి ఒక్కరిని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. 

గద్దర్ అంత్యక్రియలకు హాజరై తమను ఓదార్చి మనోధైర్యం ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు. త్వరలోనే గద్దర్ సంతాప సభ నిర్వహణ తేదీ, సమయం, వేదికను ప్రకటిస్తాం”అని పేర్కొన్నారు. గద్దర్‌‌కు అత్యంత ఆప్తమిత్రుడు సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ చనిపోవడం బాధాకరమని, ఆయన మృతికి విమలా గద్దర్‌‌ సంతాపం ప్రకటించారు.