
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు సర్వీసు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందించే సేవల ఫీజులను ప్రభుత్వం పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు, చిట్ ఫండ్ లకు సంబంధించిన ఛార్జీలను భారీగా పెంచింది. పెరిగిన చార్జీలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయాని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందించే వివిధ సేవల ఫీజులను భారీగా పెంచింది.
గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్ ఛార్జీ 500 రూపాయలు ఉండగా ఇప్పుడు 2 వేలకు పెరిగింది. సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్ కు గతంలో 300 రూపాయలు ఉంటే ఇప్పుడు వెయ్యికి పెరిగింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, GPAలకు గతంలో 2 వేలు ఉండగా.. ఇప్పుడు 5వేలు, గరిష్ఠంగా లక్ష రూపాయలు నిర్ణయించారు. ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేసే చార్జీ గతంలో వెయ్యి రూపాయలు ఉంటే..ఇప్పుడు 10 వేలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులకంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి అదనపు సభ్యుడికి మరో వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 75 ఏళ్ల పైబడి వృద్ధులకు ప్రైవేటీ అటెండన్సీ ఫీజును 5 వేలుగా నిర్ణయించింది సర్కార్ . సర్టిఫైడ్ కాపీ, ఈసీలకు గతంలో 200 రూపాయలు ఉండగా ఇప్పుడు 500కు పెరిగింది. సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్ కు ఫీజును 5 వేలుగా నిర్ణయించింది. వీలునామా రిజిస్ట్రేషన్ కు 3వేలు, వీలునామా విచారణ, వీలునామా సీల్డు కవర్ డిపాజిట్ , వీలునామా సీలు తెరవడం లాంటి వాటికి 5 వేలుగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.