ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • గతంలో ఆగిన చోట నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు

అమరావతి: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే  మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న పోలింగ్ నిర్వహించి, మార్చి 14న ఫలితాలు వెల్లడిస్తారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచి కొనసాగించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ దశలో ఉండగా కరోనా ప్రబలడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల షెడ్యూల్ ఇలా

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 3, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన: మార్చి 3, మధ్యాహ్నం 3 గంటల తర్వాత

పోలింగ్ జరిగే తేది: మార్చి 10 బుధవారం ఉదయం 7 నుంచి 5 గంటల వరకు

రీపోలింగ్: మార్చి 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు (అవసరమైన చోట్ల )

ఓట్ల లెక్కింపు: మార్చి 14న ఉదయం 8 గంటలకు..

ఇవి కూడా చదవండి

నీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ

మద్యం మత్తులో యువకుడు వీరంగం: వివాహ వేడుకలో నలుగురికి కత్తి పోట్లు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌