- వెల్లడించిన మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) రానున్న కొన్నేళ్లలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడానికి సుమారు 12–15 బిలియన్ డాలర్ల (సుమారు రూ1.30 వేల కోట్ల) ను ఇన్వెస్ట్ చేస్తుందని ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ వెల్లడించింది. ఒక గిగావాట్(జీడబ్ల్యూ) డేటా సెంటర్ నిర్మాణం ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన షేర్‌హోల్డర్ మీటింగ్‌లో ఏఐ రంగంలోకి ప్రవేశిస్తామని రిలయన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్త సబ్సిడరీ రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించనుంది. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడం, గ్లోబల్ భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, సేవలు, ఉద్యోగుల స్కిల్స్ పెంచడంపై ఫోకస్ పెడుతుంది. రిలయన్స్ మొదటి దశ డేటా సెంటర్ నిర్మాణం ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రారంభమైంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ మెటా, గూగుల్, అజూర్‌తో భాగస్వామ్యాల ద్వారా ఏఐ సేవలను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఫేస్‌బుక్ ఓవర్‌సీస్‌తో కలిసి రూ.855 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ ఎంటర్‌ప్రైస్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (ఆర్‌ఈఐఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసింది.
