న్యూఢిల్లీ:ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. రాబోయే ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. గతంలో మొబైల్ డేటా, నెట్ సేవలను చౌకగా అందించినట్లే, ఏఐని కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలో గురువారం భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ఆయన మాట్లాడారు.
జియో ద్వారా భారత్‌ను ఇంటర్నెట్ యుగానికి అనుసంధానించామని, ఇప్పుడు ఇంటిలిజెన్స్ యుగానికి ఏఐను చేరువ చేస్తామని పేర్కొన్నారు. జామ్‌నగర్‌లో గిగావాట్ కెపాసిటీ ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తామని, ఇందుకు 10 గిగావాట్ల గ్రీన్ పవర్ వినియోగిస్తామని చెప్పారు. టెలికాం రంగంలో జియో తీసుకొచ్చిన విప్లవాన్నే ఏఐలోనూ తెస్తామని స్పష్టం చేశారు.
కిరాణాలు, క్లినిక్‌లు, క్లాస్‌రూమ్‌ల నుంచి పొలాల వరకు ఏఐ సేవలను అత్యంత తక్కువ ధరకే అందిస్తామన్నారు. జియో శిక్షక్, జియో ఆరోగ్య ఏఐ, జియో కృషి, జియో భారత్ ఐక్యూ వంటి అప్లికేషన్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి ఏఐ ఎంతో దోహదపడుతుందని అంబానీ అన్నారు.
