- వనపర్తి జిల్లాలోని పెండింగ్దరఖాస్తులకు మోక్షం!
- అమ్మినవారి సంతకాలతో తిప్పలు తప్పినట్టే..
- కొన్నవారి అఫిడవిట్ ఉంటే చాలు!
- నిబంధనల సడలింపుతో దరఖాస్తుదారులు రిలీఫ్
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో 8, 600 సాదాబైనామా దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం సాదా బైనామాల సమస్య పరిష్కారంలో భాగంగా ఇకపై భూమి అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన పని లేదని, కొన్న వారు ఇస్తే సరిపోతుందని గత నెల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు మే నెలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు గోపాల్పేట మండంలో రైతుల భూ సమస్యలకు అధికారులు నిర్ధారిత సమయంలో పరిష్కారం చూపారు. అప్పుడు ఎక్కువగా సాదాబైనామా దరఖాస్తులే రాగా వాటిని తరువాత పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. దాదాపు 11 నెలల తరువాత మంత్రి సాదాబైనామాలపై క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతానికి వనపర్తి జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలిగింది.
పట్టా భూమి సాదాబైనామా చేసుకుంటేనే..
గతంలో సాదా పేపరు మీద అమ్మకం చేసిన భూమి యజమాని పేరు రికార్డుల్లో ఉండాలని, పట్టాదారై ఉండాలని, అది పట్టాల్యాండ్ అయి ఉండాలని అప్పుడే దాన్ని సాదా బైనామా క్రయ విక్రయంగా పరిగణిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. 2020లో ఆర్ఓఆర్ చట్టం చేసి భూ భారతిని తీసుకొచ్చినప్పుడు అమ్మినవారు, కొన్న వారు ఇద్దరూ అఫిడవిట్లు ఇవ్వాలని పేర్కొనడంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది.
అమ్మినవారు అఫిడవిట్ ఇవ్వమంటే వారి వారసులు కొర్రీలు పెట్టారు. అమ్మినవారు తమ సంతకం అవసరం లేదని, అమ్మిన తర్వాత ఇక తమతో పనేమిటంటూ సతాయించారు. దీంతో సాదాబైనామా కింద భూముల యాజమాన్య హక్కు కొన్నవారి మీద మారకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే రైతుబంధు, సహకార సంఘం నుంచి అందే రుణాలు అందకుండా ఏండ్ల తరబడి దరఖాస్తుదారులు అవస్థలు పడుతున్నారు.
80శాతం గవర్నమెంటు భూములే..
సాదాబైనామా కింద కొన్న భూములకు పట్టాపాసుపుస్తకాలిస్తున్నారని, యాజమాన్య హక్కులు కలిగిస్తున్నారన్న ప్రకటన వెలువడడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వాటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అందులో వాస్తవ సమస్య ఉన్నవి కొన్నే ఉన్నాయని, 80శాతానికి పైగా అన్నీ గవర్నమెంటు భూములను సాదాబైనామా కింద కొన్నవిగా చూపారని పేర్కొంటున్నారు. గవర్నమెంట్, ఇనామ్, ఎండోమెంటు భూములనూ కొన్నట్లుగా దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
జెన్యూన్‌గా ఉన్నవాటిని పరిశీలిస్తాంజెన్యూన్గా ఉన్న సాదాబైనామా క్రయవిక్రయాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ భూమి, ఇనామ్ తదితర భూములు పరిగణనలోకి రావు. గతంలో కొందరు నాలుగు ఎకరాలు కొని, ఎక్స్‌టెంట్‌లో ఆరు ఎకరాలు చూపారు. అలాంటివాటివి రిజెక్టు చేస్తాం. -సుబ్రహ్మణ్యం, ఆర్డీఓ, వనపర్తి

