ఖమ్మం: మత సామరస్యమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానమని.. అన్ని మతాల ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆదివారం (మే 31) కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు దేవుళ్లు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, అయితే ప్రజా ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా పనిచేస్తోందన్నారు.
ప్రతి మతం ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల సమ్మక్క- సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి 350 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారని, మరో వారం నుంచి పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ కోసం ఇప్పటికే 68 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధికి మొత్తం వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే గణపేశ్వరాలయం అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికి కూడా ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
