గుడిసెలపైకి జేసీబీలు.మహబూబాబాద్‌‌లో తీవ్ర ఉద్రిక్తత

గుడిసెలపైకి జేసీబీలు.మహబూబాబాద్‌‌లో తీవ్ర ఉద్రిక్తత
  • మహబూబాబాద్‌‌లో తీవ్ర ఉద్రిక్తత
  • గుడిసెల్ని తొలగించేందుకు ఎక్స్‌‌కవేటర్లు, డోజర్లతో వచ్చిన అధికారులు
  • భారీగా పోలీసుల మోహరింపు.. వాహనాలకు అడ్డుగా నిలిచిన బాధితులు
  • తోపులాట.. నిరసనకారుల అరెస్ట్
  • మీడియాను రానియ్యలె.. ఫొటోలు 
  • తీస్తుంటే ఫోన్లు లాక్కున్న పోలీసులు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసు బందోబస్తు మధ్య ఎక్స్​కవేటర్లు, బుల్డోజర్ల సాయంతో గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించడంతో.. బాధితులు అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వారిని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు ఫొటోలు, వీడియో తీసేందుకు యత్నించగా.. అడ్డుకుని సెల్​ఫోన్లను లాక్కున్నారు. గుడిసెలను తొలగిస్తున్నంత సేపు మీడియా ప్రతినిధులను అటువైపు వెళ్లనివ్వలేదు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూకలెక్టరేట్ దగ్గర్లో సర్వే నంబర్ 255/1లోని 30 ఎకరాల్లో 800 మంది వరకు పేదలు గుడిసెలు వేసుకొని మూడు నెలలుగా ఇండ్ల జాగల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం తమకు ఇండ్ల పట్టాలు అందించి ఆదుకోవాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు. పట్టించుకోని సర్కారు.. గుడిసెల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆదివారం పోలీసుల సాయంతో రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు ఎక్స్​కవేటర్లు, డోజర్లను తీసుకుని గుడిసెలను తొలగించేందుకు వచ్చారు. వాహనాలకు అడ్డుగా నిలిచిన పేదలు.. ముందు తమ ప్రాణాలు తీసి, తర్వాత గుడిసెలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో మహబూబాబాద్ టౌన్ సీఐ సతీశ్‌ ఆధ్వర్యంలో అప్పటికే పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని డీసీఎం వాహనాల ద్వారా గూడూరు పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సమయంలో బాధితులు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలకు గుంట భూమి ఇవ్వలేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ మండిపడ్డారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై వారందరినీ విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గుడిసెలు తొలగించామని మహబూబాబాద్​తహసీల్దార్​ ఇమ్మానియల్​పేర్కొన్నారు. పేదలు ఇండ్ల స్థలాలు కావాలంటే ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవాలి తప్ప ఇలా ఆక్రమించరాదన్నారు.

అన్యాయంగా తొలగించిన్రు

మాకు తలదాచు కునేందుకు చోటు లేదు. ప్రభుత్వ భూములు ఉన్నయ్ కదా. ఒక్క గుంట భూమి ఇస్తే సర్కారు ముల్లె ఏంపోతది? పేదలమంతా కలిసి గుడిసెలు వేసుకుంటే పోలీసులు, ఆఫీసర్లు వచ్చి తొలగించిన్రు. మహిళలు అని కూడా చూడకుండా బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించిన్రు.
- అలువాల లావణ్య