
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరులపై పెట్టిన ఉపా(అన్ లా ఫుల్ యాక్టివిటీస్) కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీజీపీ అంజనీ కుమార్ ని ఆదేశించారు.
ప్రొఫెసర్ హరగోపాల్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసు నమోదైంది. దీన్ని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితమే పెట్టినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదీ కాస్త చర్చనీయాంశంగా మారింది. మొత్తం 152 మందిపై కూడా అభియోగాలు దాఖలయ్యాయి. ఉద్యమకారులు, మేధావులు, హక్కుల నేతలపై ఉపా కేసులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, గడ్డం లక్ష్మణ్ తో పాటు ప్రజాసంఘాల నేతలు, మేధావులు, విద్యార్థి నాయకులు పేర్లు ఇందులో ఉన్నాయి.
ఈ కేసు వివరాలన్నీ ఆలస్యంగా వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునె లల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో...ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు గతేడాది దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించారు. ఇందులో కీలక అంశాలు వెలుగు చూశాయి.