- సామాజిక సేవలకుగాను గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ రెనోవా ఆంకాలజీ సీఈవో డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రజారోగ్యం, లింగ సమానత్వం, పారిశుధ్యం మెరుగుదల కోసం చేస్తున్న నిరంతర సేవలకుగాను ఆయనకు..న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రధాన కార్యాలయంలో గురువారం ఘన సన్మానం జరిగింది.
ఐరాస ప్రతినిధి అంబాసిడర్ లూయిస్ సువారెజ్ హెర్నాండెజ్, గ్లోబల్ పీస్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ బర్ఖా వర్షా చేతుల మీదుగా శ్రీధర్ పెద్దిరెడ్డి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన (ఎస్డీజీ) ఆరోగ్యం, సమానత్వం, పారిశుధ్యం వంటి ఐదు కీలక అంశాల్లో ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.
