మోర్బీ తీగల వంతెనకు కొత్త ఫ్లోరింగ్ వేసి.. కేబుల్స్ మార్చని కాంట్రాక్టర్లు

మోర్బీ తీగల వంతెనకు కొత్త ఫ్లోరింగ్ వేసి.. కేబుల్స్ మార్చని కాంట్రాక్టర్లు

మోర్బీ: గుజరాత్​లోని మోర్బీ టౌన్ లో తీగల వంతెన తెగిపోయిన ఘటనకు కాంట్రాక్టర్ల తప్పిదమే కారణమని కోర్టుకు ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. ఆదివారం బ్రిడ్జి కూలిపోయి 135 మంది చనిపోయిన ఘటనకు సంబంధించిన కేసులో బుధవారం మోర్బీ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంజే ఖాన్ విచారణ జరిపారు. బ్రిడ్జి రిపేర్ పనులను అర్హత లేని కాంట్రాక్టర్ (అజంతా గోడ గడియారాలు తయారు చేసే ఒరెవా కంపెనీ)కు అప్పగించగా, ఆ కంపెనీ మరో ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిందని కోర్టుకు ప్రాసిక్యూటర్ హెచ్ఎస్ పాంచాల్ తెలిపారు. ‘‘బ్రిడ్జికి ఉన్న పాత ఫ్లోరింగ్ ను తొలగించి, కొత్తగా 4 లేయర్లతో అల్యూమినియం ఫ్లోరింగ్ వేశారు. కానీ పాత కేబుల్స్ స్థానంలో కొత్తవి వేయకుండా అలానే వదిలేశారు. దీంతో కొత్త అల్యూమినియం ఫ్లోరింగ్ బరువును ఆపలేక పాత మెయిన్ కేబుల్ తెగిపోయింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు తమ రిపోర్టులో ఇదే విషయాన్ని పేర్కొన్నారు” అని ప్రాసిక్యూటర్ వివరించారు. బ్రిడ్జి రిపేర్ పనులకు అర్హత లేకున్నా, ఇదే కాంట్రాక్టర్లకు 2017లో ఆ తర్వాత 2022లో పనులు అప్పగించారన్నారు. తాజా ఒప్పందం సందర్భంగా బ్రిడ్జి రిపేర్ పనులకు 12 నెలలు పడుతుందని చెప్పిన కంపెనీ.. 7 నెలలకే హడావుడిగా పనులు ముగించిందన్నారు. ప్రభుత్వం నుంచి క్వాలిటీ టెస్టింగ్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ వంటివి కూడా లేకుండానే దీపావళి, ఛఠ్ పండుగల సందర్భంగా హడావుడిగా రీఓపెన్ చేసిందన్నారు.

కొనసాగుతున్న సెర్చింగ్

నదిలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. స్కూబా డైవర్లతో గాలింపు కొనసాగుతోందని, బురద నీటిలో ఎలక్ట్రానిక్ పరికరాల జాడ కోసం  సోనార్ టెక్నాలజీతో కూడా వెతుకుతున్నామని చెప్పారు. ఇంకా చాలా మంది తమ వాళ్ల ఆచూకీ తెలియడంలేదని చెప్తున్నారని, చివరి వరకూ సెర్చ్ కొనసాగిస్తామన్నారు.   

దేవుడి సంకల్పం వల్లే ఈ ప్రమాదం.. కోర్టులో వెల్లడించిన నిందితుడు

దేవుడి సంకల్పం మేరకే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని తీగల వంతెన కూలిపోవడంపై ఒరెవా కంపెనీ మేనేజర్, నిందితుడు దీపక్ పరేఖ్ కోర్టులో వింత కామెంట్ చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో ఒరెవా కంపెనీకి చెందిన మేనేజర్లు దీపక్ పరేఖ్, దినేశ్ దవే, సబ్ కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మర్, దేవాంగ్ పర్మర్, సెక్యూరిటీ గార్డులు, టికెట్ బుకింగ్ క్లర్కులు సహా 9 మందిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. వీరిలో మేనేజర్లు, సబ్ కాంట్రాక్టర్లను జడ్జి శనివారం వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించారు. మిగతా ఐదుగురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాగా, బ్రిడ్జి ప్రమాదం ఈతర్వాత నుంచీ ఒరెవా కంపెనీ ఎండీ జయ్ సుఖ్​భాయ్ పటేల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కంపెనీ ఓనర్లపై కేసు పెట్టకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ కేసులో నిందితుల తరఫున వాదించబోమని మోర్బీ బార్ అసోసియేషన్ ప్రకటించింది.