బీజేపీకి సొంతంగానే..350 ఎంపీ సీట్లు రావొచ్చు : సుర్జిత్ భల్లా

బీజేపీకి సొంతంగానే..350 ఎంపీ సీట్లు రావొచ్చు : సుర్జిత్ భల్లా
  • తమిళనాడులో 5, కేరళలో 1‌‌‌‌‌‌‌‌-2 సీట్లూ గెలవొచ్చు

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతం గానే 330 నుంచి 350 ఎంపీ సీట్లు రావొచ్చని ప్రముఖ ఆర్థికవేత్త, సెఫాలజిస్ట్ (ఎన్నికలపై స్టడీ చేసే వ్యక్తి) సుర్జిత్ భల్లా అంచనా వేశారు. 2019 లోక్ సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి 5 నుంచి 7% సీట్లు పెరగొచ్చని తెలిపారు. కాంగ్రెస్ కు 2014 ఎన్నికల కంటే 2% తక్కువగా 44 సీట్లు మాత్రమే రావొచ్చన్నారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వ లేమియే అసలు సమస్య అని చెప్పారు.

‘హౌ వియ్ వోట్’ పేరుతో ఇటీవలే కొత్త పుస్తకాన్ని రిలీజ్ చేసిన ఆయన తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. తన మిత్రపక్షాలు కాకుండా బీజేపీ సొంతంగా 350 వరకూ సీట్లను గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో వేవ్ వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ‘‘ఎన్నికల్లో ప్రజల ఎకానమీయే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత లీడర్షిప్​కు రెండో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండూ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రధాని మోదీకి ఉన్న మాస్ అప్పీల్​లో కనీసం సగం చరిష్మా ఉన్న లీడర్ ను అయినా ప్రతిపక్ష కూటమి ఎన్నుకుని ఉంటే.. పోటీలో ఉన్నట్టుగా భావించేవాళ్లం” అని సుర్జిత్ అభిప్రాయపడ్డారు. 

సీఎంఐఈ డేటా హాస్యాస్పదం.. 

తమిళనాడులో చాలా వీక్ గా ఉన్న బీజేపీ ఈసారి కొంచెం పుంజుకుంటుందని, కనీసం 5 సీట్లను గెలుచుకోవచ్చని సుర్జిత్ తెలిపారు. కేరళలోనూ ఒకటి రెండు సీట్లు ఆ పార్టీకి రావొచ్చన్నారు. 2019తో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగం కొంతైనా తగ్గిందన్నారు. యెమెన్, ఇరాక్ దేశాల కంటే ఇండియాలోనే తక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలో ఉన్నారనడమే సీఎంఐఈ డేటా ఎంత హాస్యాస్పదమో తెలియజేస్తోందన్నారు.