డీజేలు, మద్యం.. ఇదేనా భక్తి..? ‘గణపతి’ పేరుతో హంగామా ఎందుకు..? అర్ధరాత్రి డీజేలపై సోషల్ మీడియాలో రేణు దేశాయ్ అసహనం

డీజేలు, మద్యం.. ఇదేనా భక్తి..? ‘గణపతి’ పేరుతో హంగామా ఎందుకు..? అర్ధరాత్రి డీజేలపై సోషల్ మీడియాలో రేణు దేశాయ్ అసహనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జనాల సందర్భంగా అర్థరాత్రి వరకు సౌండ్ పై నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు  చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌‌‌‌లోని తన నివాసం వద్ద గురువారం అర్ధరాత్రి వరకు సౌండ్ పై ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. చదువుకున్న మానవులు సమాజానికి మేలు చేయాల్సింది పోయి పెద్ద ఉపద్రవంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాస్తమయానికి ముందే పూజలు, నిమజ్జనాలు పూర్తి చేయాలని కోరారు. 

అర్ధరాత్రి మద్యం సేవించి రోడ్లపై డ్యాన్సులు చేయడం మన సంప్రదాయం కాదన్నారు. రేణు దేశాయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించడంతో పాటు ఆమెపై ట్రోలింగ్‌‌‌‌కు దిగారు. దీనికి ఆమె శుక్రవారం మరో వీడియో ద్వారా సమాధానమిచ్చారు. తాను 18వ అంతస్తులో సౌండ్‌‌‌‌ ప్రూఫ్ గదిలో ఉంటానని, డప్పులు, డీజేలపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

అయితే, నగరంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సగం హైదరాబాద్ వారు ఇప్పుడు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారని, వారి పరిస్థితి ఏంటన్నారు. మనుషుల అంత్యక్రియలే సాయంత్రం 6 గంటల తర్వాత నిర్వహించరని, అలాంటప్పుడు దేవుడి నిమజ్జనాలు రాత్రివేళల్లో ఎలా నిర్వహిస్తారని ఆమె ప్రశ్నించారు. నిమజ్జన వేడుకల్లో డ్యాన్సులు చేసే వారిలో ఎంతమందికి ‘గణపతి అథర్వశీర్షం’ తెలుసని నిలదీశారు. లోకమాన్య తిలక్‌‌‌‌ ప్రజల్లో ఐక్యత కోసం గణేశ్ ఉత్సవాలను ప్రారంభిస్తే.. వాటిని డీజే పార్టీలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు. 

ప్రశ్నించిన మహిళపై అసభ్య పదజాలంతో దాడి చేయడమేనా సనాతన ధర్మమని ఆమె ప్రశ్నించారు. తాను గత రెండు దశాబ్దాలుగా గణపతిని నిష్టగా ఆరాధిస్తున్న గర్వించదగిన సనాతనినని అన్నారు. తనకు గణపతి, శివుడు, అమ్మవారు అయినా  చాలా ఇష్టమన్నారు. తాను ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలను ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా సంబరాలు చేసుకోవాలని సూచించారు. 

ఆమె తాజా వీడియో, వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారాయి. తాగాలంటే పబ్ లకు వెళ్లి తాగండి, అక్కడ నచ్చినట్లు  డ్యాన్స్ చేయండని, ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. పోలీసులకు తానే 11.30 కి కాల్ చేశానని, కానీ ఏడాదికోసారి ఏం చేయాలి మేడం అని పోలీసులు అన్నట్లు తెలిపారు.