రాజ్యసభకు నామినేషన్లు వేసిన రేణుక, అనిల్

రాజ్యసభకు నామినేషన్లు వేసిన రేణుక, అనిల్

రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత రేణుకా చౌదరి, యూత్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.  మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్,  తెలంగాణ  కాంగ్రెస్  ఇన్ ఛార్జ్  దీపాదాస్ మున్షీ, దిగ్విజయ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్లకు ఇవాళ చివరి తేది కావడంతో నామినేషన్ వేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి రేణుక, అనిల్ లకు బీఫాంలు అందజేశారు. 

బీఆర్ఎస్ నుంచి  వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు.  ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  రాజ్యసభకు వద్దిరాజు పేరును మరోసారి కేసీఆర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్​ల పదవీ కాలం పూర్తవడంతో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం కాంగ్రెస్​కు రెండు, బీఆర్ఎస్​కు ఒకటి దక్కనున్నాయి. అయితే మూడో సీటు కోసం కాంగ్రెస్​ మరో అభ్యర్థిని నిలిపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరగ్గా, దానికి హైకమాండ్​ఫుల్ స్టాప్ పెట్టింది. కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించి ఉంటే, ఎన్నిక అనివార్యమై ఉండేది. కానీ ఇద్దరినే నామినేట్​చేయడంతో ఎన్నిక తప్పినట్టయింది.