అనుభవానికి పెద్దపీట.. రేణుకాచౌదరికి రాజ్యసభ

అనుభవానికి పెద్దపీట.. రేణుకాచౌదరికి రాజ్యసభ

రాజ్యసభకు రేణుకా చౌదరి
సీనియర్ నేతకు కాంగ్రెస్ అవకాశం
అనిల్ కుమార్ యాదవ్ కూ చాన్స్
హైదరాబాద్ లో పార్టీ బలోపేతంపై నజర్
రేపటితో నామినేషన్లకు ఆఖరి రోజు

హైదరాబాద్:  రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అధినాయకత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఎంపిక చేసింది.  అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు మరో స్తానాన్ని కేటాయిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.  కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయంతో తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీపడుతున్న కొంతమంది ఆశావహులకు చెక్‌ పడింది. ఇదిలా ఉండగా రేపటితో రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

అనుభవానికి అందలం

1954 ఆగస్టు 13న ఏపీలోని విశాఖ పట్నంలో జన్మించిన రేణుకా చౌదరి మెట్టినిల్లు ఖమ్మం. రేణుకా చౌదరి. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 1986లో జీహెచ్ఎంసీ పరిధిలో బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఈమె 1986 నుంచి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలుగా పని చేశారు. 1999,2004 లోక్‌సభ ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక అయ్యారు. దేవగౌడ ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రేణుకా చౌదరి, టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆమె అపారమైన రాజకీయ అనుభవానికి కాంగ్రెస్ అధినాయకత్వం అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది. 

ALSO READ | కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ

సికింద్రాబాద్ డీసీసీ చీఫ్​ కు చాన్స్

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, సికింద్రాబాద్ డీసీసీ చీఫ్​ అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు ఎంపిక చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పార్టీకి సేవలందించిన అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఈ స్థానాన్ని ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కు కేటాయించింది అధినాయకత్వం దీంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. మాస్ ఫాలోయింగ్ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోనున్నది. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అనిల్ టికెట్ ఆశించారు. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో రాజ్యసభకు పంపుతూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం విశేషం.