20 జట్ల మధ్య సమరం.. జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచకప్‌!

20 జట్ల మధ్య సమరం.. జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచకప్‌!

క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త వచ్చేసింది. వచ్చే ఏడాది జరగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్‌(ICC Men's T20 World Cup 2024) జూన్‌ 4 నుంచి 20 మధ్య  నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా నిర్ణయించిందని సమాచారం. నిరుడు ఆస్ట్రేలియా(Australia) వేదికగా పొట్టి ప్రపంచకప్‌ సమరం జరగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌(West Indies), అమెరికా(USA) దేశాలు సంయక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.

20 జట్ల మధ్య పోరు

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి. 

ఐదేసి జట్లు చొప్పున 4 గ్రూపులు

జట్లు ఎక్కువ అవ్వడంతో ఈసారి టోర్నీని భిన్నంగా నిర్వహించనున్నారు. గతంలో తొలి రౌండ్‌ ముగిశాక సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఈసారి 20 జట్లను ఐదేసి జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా ఆడిస్తారు. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి.

8 స్ధానాలకు రీజినల్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు

ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా,శ్రీలంక జట్లు గత టీ20 ప్రపంచకప్‌లో టాప్‌ 8లో నిలిచిన జట్లు కాగా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 9, 10 స్ధానాల్లో ఉన్న ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కూడా ఈ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మరోవైపు అమెరికా, వెస్టిండీస్‌ జట్లు అతిథ్య హోదాలో  బెర్త్‌లు ఖారారు చేసుకున్నాయి. మిగిలిన 8 స్ధానాలకు ప్రస్తుతం రీజినల్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు జరగుతున్నాయి.