త్వరలో దేశంలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు.. ధర రూ. 20 లక్షలే!

త్వరలో దేశంలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు.. ధర రూ. 20 లక్షలే!

అమెరికా కార్ల దిగ్గజం 'టెస్లా' త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. వీలైనంత త్వరగా భారత గడ్డపై అడుగుపెట్టేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ కోసం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఏటా 5 లక్షల ఈవీ కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా కంపెనీ భావిస్తోందని సమాచారం. 

ప్రారంభ ధర రూ.20 లక్షలు

దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం ఇప్పుడిప్పుడే జోరందుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ద్రుష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కార్ల కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్‌పై ద్రుష్టి పెడుతున్నాయి.

దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. వీరిని దృష్టిలో ఉంచుకొని టెస్లా కంపెనీ రూ.20 లక్షల ప్రారంభ ధరతో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుందని సమాచారం. అలాగే, భారత్‌ కేంద్రంగా ఉత్పత్తి చేసిన కార్లను ఇండో-పసిఫిక్‌ దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయాలని ఎలాన్‌ మస్క్‌ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన మస్క్ త్వరలోనే ఇండియాలో టెస్లా ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, దీనిపై త్వరలోనే అధికార ప్రకటన ఉంటుందని తెలిపారు. ఈ భేటీ తరువాత భారత ప్రభుత్వంతో టెస్లా కంపెనీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.