పదవీకాలం పొడిగించండి.. సర్కారుకు ఎంపీటీసీ, జడ్పీటీసీల వినతి

పదవీకాలం పొడిగించండి.. సర్కారుకు ఎంపీటీసీ, జడ్పీటీసీల వినతి
  • జూన్ 3, 4తో  ముగిసిన లోకల్ బాడీల టర్మ్
  • 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న గౌరవ భృతి ఇవ్వాలని సీఎంకు రిక్వెస్ట్
  • మూడేండ్లు ఎస్ఎఫ్​సీ ఫండ్స్ ఇవ్వని గత బీఆర్ఎస్  సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోకల్ బాడీ నేతలు మాజీలు కానున్నారు. జూన్ 3, 4తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్  ముగిసింది. ఎన్నికలు నిర్వహించే వరకు తమ పదవీకాలం పొడిగించాలని  సీఎం రేవంత్​ను నేతలు కోరుతున్నారు. ఐదేండ్ల టర్మ్ లో రెండేండ్లు కరోనాతో నష్టపోయామని తెలిపారు. కాగా.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి  నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీల టర్మ్ కూడా పూర్తి కానుండడంతో  లోకల్ బాడీ వ్యవస్థలో కీలకంగా ఉన్న ముగ్గురు (సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు) మాజీలవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ టర్మ్  పొడిగించాలని ఉన్నతాధికారులకు వారు వినతిపత్రాలు అందిస్తున్నారు. గత ఐదేండ్ల పాటు నిధుల్లేక లోకల్ బాడీ నేతలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తున్నా వాటిని గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఫ్రీజ్  చేసిందని, ఇతర స్కీమ్ లకు మళ్లించిందని వారు వాపోయారు. కేంద్రం నిధులు ఖర్చుచేస్తే వాటి వివరాలను తెలిపే యూసీ (యుటిలైజేషన్  సర్టిఫికెట్లు) పంపడంలోనూ అధికారులు తీవ్ర ఆలస్యం చేశారని తెలిపారు. దీనికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే కారణమని చెబుతున్నారు. దీంతో కేంద్రం నిధులు కూడా  ఆలస్యం అయిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చినట్లుగా ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని మాజీ సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారని, కొంతకాలం నిధులు విడుదల చేసి తరువాత బంద్ చేశారని తెలిపారు.  మూడేండ్లుగా ఎస్ఎఫ్ సీ నిధులు రావడం లేదని, ఈ ఏడాది ఏప్రిల్  నుంచి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

8 నెలలుగా గౌరవ భృతి లేదు

రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13 వేలు, ఎంపీటీసీలకు రూ.6,300 గౌరవ వేతనం అందిస్తోంది. జడ్పీ చైర్మన్​కు ఏకంగా రూ.లక్షతో పాటు వాహనం కూడా సమకూరుస్తోంది. గత 8 నెలలుగా  గౌరవ భృతి ఇవ్వడం లేదని లోకల్  బాడీ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విడుదల చేయాలని కోరుతున్నారు.

కొత్త ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి 

ఎన్నికలు జరిపే వరకూ మా టర్మ్  పొడిగించాలి. రెండేండ్లు కరోనాతో వేస్ట్ అయింది. మరోవైపు నిధులు రిలీజ్  చేయకుండా లోకల్ బాడీలను మాజీ సీఎం కేసీఆర్  నిర్వీర్యం చేశారు.  గ్రామంలో, మండలంలో ఎంపీటీసీలకు కనీస మర్యాద లేకుండా చేశారు. నిధులు కేటాయించాలని, అధికారులను సమకూర్చాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం పట్టించుకోలే. కొత్త ప్రభుత్వం అయినా చొరవ చూపాలి.
– ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, సైదాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా