అవునా.. నిజమా : ఆర్టీసీ బస్సుల్లో మగాళ్లకు రిజర్వేషన్..!

అవునా.. నిజమా : ఆర్టీసీ బస్సుల్లో మగాళ్లకు రిజర్వేషన్..!

రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన వస్తోంది. దీని ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కలిగింది. తాజాగా పురుషుల కోసం కూడా ప్రభుత్వం ఓ వినూత్న సేవలను అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. TSRTC బస్సుల్లో ప్రయాణించే పురుషులు త్వరలో రిజర్వ్ చేయబడిన సీట్లు లేదా పురుషులకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 20 శాతం పెరిగినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో మగ వారిని కూడా పరిగణలోకి తీసుకుని, వారి కోసం కొన్ని ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, పురుషులు, వృద్ధులు, విద్యార్థులు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బస్సుల్లో పురుషులకు రిజర్వేషన్లు కల్పించడం, వృద్ధులు, విద్యార్థులకు సీట్ల కేటాయింపు, వీలైతే పురుషులకు ప్రత్యేక బస్సులు వంటి వివిధ ఆప్షన్లను ఆర్టీసీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. బస్సుల్లో ఎక్కువ భాగం మహిళలతో నిండిపోవడంతో పురుషులు ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఈ పరిణామాలను సీనియర్ అధికారులు, బస్ కండక్టర్లు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవసరమైన రూట్లపై దృష్టి సారించిన ఆర్టీసీ.. ప్రత్యేక సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుందని ప్రచారం సాగుతోంది.

దీంతోపాటు పురుషులకు, ముఖ్యంగా వృద్ధులకు సీట్ల కేటాయింపుపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌లో లేదా మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక స‌ర్వీసుల‌లో బ‌స్సుల‌ను న‌డప‌డానికి కూడా ప్లాన్ చేస్తోంది. విద్యార్థులకు కొన్ని ప్రత్యేక సేవలను అందించడానికి చర్చలు జరుగుతున్నాయి. పురుషులకు కూడా సరసమైన వసతి కల్పించడానికి బస్సులలో కొన్ని రకాల రిజర్వేషన్‌లను తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. అంచనాల ప్రకారం మహిళా ప్రయాణికుల నిష్పత్తి 69 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 లక్షల నుంచి 14 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించే వారు. కానీ ఈ పథకం వల్ల ఈ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరుకుంది.