రాష్ట్రమంతటా పగడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ బయటికి రాకుండా మరింత కట్టడి చేస్తామన్నారు.
లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చామని, వారికి ఇచ్చిన పాసులను సమీక్షిస్తామని తెలిపారు. పాసులను దుర్వినియోగం చేసినట్లు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే పాసులు ఇస్తామని, సమయం, ప్రయాణించే మార్గం కూడా నిర్ణయించేలా కొత్త పాసులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాసులు అప్పటి వరకు కొనసాగుతాయన్నారు. మొదట్లో మూడు కమిషనరేట్ పరిధిల్లో చెల్లే విధంగా పాసులు ఇచ్చామని..ఇప్పుడు ఆ పాస్ లకు బదులు ఏ కమీషనరేట్ పరిధిలో ఆ పాస్ లు జారీ చేస్తామని చెప్పారు.
విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో రోజు ఒక్కో పాస్ చొప్పున .. 6 రోజుల పాటు 6 కలర్స్‌లో పాస్ లు ఇస్తామని చెప్పారు. నిత్యావసరాలు సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లేవారు 3 కి.మీ దాటకూడదని డీజీపీ స్పష్టం చేశారు.ఆస్పత్రులకు వెళ్లేవారు దగ్గర్లోని ఆస్పత్రులకే వెళ్లాలని, వారు కూడా అడ్రస్ ప్రూఫ్ తీసుకుని వెళ్లాలని సూచించారు. దూరంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే గతంలో సంబంధిత ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలు వెంట తీసుకెళ్లాలన్నారు.
హైదరాబాద్ సిటీ లో వెహికల్స్ తిరిగే వారి సంఖ్య పెరిగింది…
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష 21 వేల వాహనాలు సీజ్ చేశామని చెప్పారు డీజీపీ. కొంత మంది యువకుల్లో వాహనాలు సీజ్ చేసినా ఎలాంటి మార్పు రావడం లేదని, వారి పై కట్టిన చర్యలు తీసుకుంటామన్నారు. వారి పై కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరుపరుస్తామని చెప్పారు.
ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ లు ధరించాలని, సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలన్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వారు తప్పని సరిగా సామాజిక దూరం పాటించాలని, సూపర్ మార్కెట్ ల వద్ద సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుంటే సూపర్ మార్కెట్ సీజ్ చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ సమయాల్లో పోలీసులు బాగా కష్టపడుతున్నారన్న డీజీపీ.. పోలీస్ శాఖ కృషిని మెచ్చిన 10 శాతం గిఫ్ట్ ఐచ్చినందుకు సీఎం కు ధన్యవాదాలు తెలిపారు.

