ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసిన ‘బస్వాపురం నిర్వాసితులు

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసిన ‘బస్వాపురం  నిర్వాసితులు

యాదాద్రి, వెలుగు : ‘సర్కారు దగ్గర పైసలకు కొంత ఇబ్బందయితుంది. వచ్చిన కాడికి తీసుకోండి’ అని తనను కలిసిన బస్వాపురం నిర్వాసితులతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ కారణంగా బీఎన్​ తిమ్మాపురం పూర్తిగా మునిగిపోతోంది. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగడంతో పాటు మంత్రి హరీశ్​రావు, సీఎస్​ శాంతకుమారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ  క్రమంలో భువనగిరి ఎమ్మెల్యేను హైదరాబాద్​లోని ఆయన నివాసంలో బస్వాపురం నిర్వాసితులు కలిశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. దీంతో పరిహారం గురించి తాను సీఎం కేసీఆర్​తో మాట్లాడానని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. గతంలో వచ్చిన రూ. 50 కోట్లను నిర్వాసితులకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ..ఇప్పుడు పైసలకు కొంత ఇబ్బందిగా ఉందన్నారు. త్వరలో మరికొన్ని డబ్బులు వస్తాయని చెప్పారు. దీని గురించి సీఎం కేసీఆర్​ను బుధవారం మళ్లీ కలుస్తున్నానని చెప్పారు. కాగా పరిహారం కోసం నిర్వాసితులు 57వ రోజైన మంగళవారం బస్వాపురం రిజర్వాయర్​ కట్టపై ఆందోళన చేశారు.

భూ సేకరణకు నోటీసులు జారీ ‌‌- తిరస్కరించిన గ్రామస్థులు

బస్వాపురం రిజర్వాయర్​ భూ సేకరణ కోసం జారీ చేసిన నోటీసులను యాదాద్రి జిల్లా బీఎన్​ తిమ్మాపురం గ్రామస్థులు తిరస్కరించారు. ఇప్పటివరకూ 1,745 ఎకరాల అగ్రికల్చర్​ భూములనే సేకరించిన ఆఫీసర్లు.. ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన భూమిని సేకరించేందుకు  అవార్డు ప్రకటించే  ప్రయత్నం చేస్తున్నారు.  ఇందులో భాగంగా   860 కుటుంబాలకు భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్​రెడ్డి నోటీసులిచ్చారు.  ఈ నోటీసుల్లో ప్రతి ఇంటి వైశాల్యంతో పాటు ఖాళీ స్థలం, అక్కడి చెట్లు, పశువుల వివరాలను పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన ఆర్​ఐ భద్రయ్య, వీఆర్​ఏ నవనీత ఈ నోటీసులను తీసుకోవాలని గ్రామస్థులను కోరగా వారు తిరస్కరించారు. గతంలో సేకరించిన భూములకే ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు నోటీసులు జారీ చేయడమేమిటని ఉడుత ఆంజనేయులు, మాజీ సర్పంచ్​ రావుల అనురాధ, గ్రామస్థులు ప్రశ్నించారు. దీంతో రెవెన్యూ స్టాఫ్ వెనుదిరిగి పోయారు.