మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ యంత్రాలు ఉన్నప్పటికీ.. టెక్నీషియన్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లేక నిరుపయోగంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని, రెండో ఫీడర్ లైన్ పనులు పూర్తి చేసి చేంజ్ ఓవర్ స్విచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రెండో ఆపరేషన్ థియేటర్ ప్రారంభానికి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

