ప్రధాని మోడీ హయాంలోనే మన వారసత్వ సంపదకు గౌరవం : కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ హయాంలోనే మన వారసత్వ సంపదకు గౌరవం : కిషన్ రెడ్డి
  •     రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక కట్టడాలకు పూర్వవైభవం
  •     రూ. 610 కోట్లతో ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాల అభివృద్ధి
  •     ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదకు సరైన గౌరవం దక్కుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో రూ. 610 కోట్లతో రాష్ట్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించేందుకు కృషి చేసినట్లు వెల్లడించారు. ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ సందర్భంగా మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఈ ఏడాది ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ‘హెరిటేజ్ చేంజెస్’  థీమ్ తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మన వారసత్వ కట్టడాల పరిరక్షణకు సాంప్రదాయ రీతిలో ఎలా కృషి చేయాలన్నదే ఈ థీమ్ లక్ష్యమని చెప్పారు. ‘వికాస్ భీ.. విరాసత్ భీ’ నినాదంతో ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. గత తొమ్మిదేండ్లలో 231 పురాతన వస్తువులను విదేశాల నుంచి తిరిగి తెచ్చామని, మరో 72 వస్తువులను యూఎస్, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి తిరిగి తెచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ పండుగలు బతుకమ్మ, బోనాలు వేడుకలు, మేడారం జాతరలో యాత్రికులకు సౌలతుల ఏర్పాటులోనూ కేంద్రం తన వంతు తోడ్పాటును అందించిందన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా తొలిసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను’ అధికారికంగా నిర్వహించామన్నారు.