
సికింద్రాబాద్, వెలుగు: ఓ బాలికను లాడ్జ్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ జవాన్‌కు 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్‌లోని ఓ హోంలో ఆశ్రయం పొందుతున్న బాలిక.. సికింద్రాబాద్ పాలికా బజార్లో టైలరింగ్ నేర్చుకునేది. ఈ క్రమంలో 2017 జులై 24న ఉదయం11 గంటల సమయంలో టైలరింగ్ శిక్షణ కేంద్రానికి వెళుతూ పక్కనే ఉన్న బస్టాప్‌లో కూర్చున్నది.
అదే సమయంలో యాప్రాల్‌లో నివాసముండే రిటైర్డ్ ఆర్మీ జవాన్ పెరియాటి శ్రీధరన్(59) బైక్‌పై అమ్మాయి వద్దకు వెళ్లి ‘‘ఆకలిగా ఉందా? భోజనం చేస్తావా?” అని అడిగాడు. బాలిక వద్దని చెప్పినా శ్రీధరన్ ఆమెను బలవంతంగా ఓ హోటల్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆమెను తన బైక్‌పై లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. లాడ్జ్ గదిలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తరువాత బాధితురాలిని బైక్ పై తీసుకువెళ్లి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద వదిలిపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఏడ్చుకుంటూ హోంకు వెళ్లిన బాధితురాలు రెండు రోజులుగా ముభావంగా ఉండడంతో హోంలోని హెల్త్ వర్కర్ ఏమైందని ఆరా తీసింది. జరిగిన ఉదంతం గురించి బాధితురాలు వివరించింది.
హోం ప్రతినిధులతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తెలిపిన వివరాలతో నిందితుడు శ్రీధరన్‌ను 2017 జులై 26న అరెస్టు చేశారు. అన్ని ఆధారాలతో నాంపల్లి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన స్పెషల్ కోర్టు జడ్జి పుష్పలత.. శ్రీధరన్ కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.