న్యాయ వ్యవస్థను కాపాడండని సీజేఐకి రిటైర్డ్ జడ్జీల లేఖ

న్యాయ వ్యవస్థను కాపాడండని సీజేఐకి రిటైర్డ్ జడ్జీల లేఖ

న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను కాపాడాలంటూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు 21 మంది రిటైర్డ్ జడ్జీలు సోమవారం లేఖ రాశారు. ఒత్తిడి తేవడం, తప్పుడు సమాచారం అందించడం, బహిరంగంగా అవమానించడం ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కాలని కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. కొంతమంది వారి రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొంతమంది కోర్టులు, జడ్జీలపై ఒత్తిడి తెస్తున్నారు. 

ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థను దెబ్బతీస్తాయి. కొన్ని గ్రూపులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే నిర్ణయాలను ప్రశంసించడం, అలా లేని వాటిపై విమర్శలు చేయడం లాంటివి చేస్తున్నారు. 

న్యాయవ్యవస్థపై ఇలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు నలుగురు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణా మురారీ, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ, జస్టిస్ ఎంఆర్ షా ఉన్నారు. కాగా, బీజేపీ పాలనలో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు పొంచి ఉన్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ‘‘న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఈ లెటర్” అని పేర్కొన్నారు.