ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలి : చంద్రకుమార్​

ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలి : చంద్రకుమార్​

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన పోలీస్​కేసులను వెంటనే ఎత్తివేయాలని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ పాలనలో అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. బాధితులంతా నేటికీ పోలీస్​స్టేషన్లు,  కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్​ప్రభుత్వం తక్షణమే ఆ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్​చేశారు. 

‘తెలంగాణ లౌకిక ప్రజాస్వామిక వేదిక’ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్​మాట్లాడుతూ.. అనుభవజ్ఞనులుగా తాము గత ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశామని, కాంగ్రెస్​ప్రభుత్వానికి కూడా ఇస్తున్నామని చెప్పారు. తాను చేసిన ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందని చెబుతున్న కేసీఆర్.. నిజమైన ఉద్యమకారుడైతే రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లపై ఉన్న కేసులను ఎందుకు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. అడవుల్లో ఉండి పోరాటం చేస్తున్న మావోయిస్టులు ప్రజాజీవితంలోకి వచ్చి, సమస్యలపై పోరాడాలని చంద్రకుమార్​పిలుపునిచ్చారు. ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.