సీఎంవో ఖాళీ.. సర్వీసులో లేని సలహాదారులు ఔట్

సీఎంవో ఖాళీ.. సర్వీసులో లేని సలహాదారులు ఔట్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో మార్పులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రావడంతో పాత ప్రభుత్వంలోని సీఎం సెక్రటరీలు, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు ఇంటిదారి పడుతున్నారు. సర్వీస్‌‌లో ఉన్న ఐఏఎస్‌‌లు తమకు అప్పగించిన ఇన్‌‌చార్జ్ బాధ్యతలకే పరిమితమయ్యారు. సెక్రటేరియెట్‌‌లో మంత్రుల చాంబర్ల దగ్గర ఉన్న వారి నేమ్ ప్లేట్లను అధికారులు తొలగించారు. ఆరో ఫ్లోర్‌‌‌‌లోని సీఎం ఆఫీసులో కేసీఆర్ నేమ్ ప్లేట్ తీసేశారు. ఆయా చాంబర్లలో ఉన్న సీఎం సెక్రటరీలు, పీఎస్‌‌లు, ఓఎస్డీల నేమ్ ప్లేట్లు తొలగించి.. క్యాబిన్లను కొత్తగా రెడీ చేస్తున్నారు. మరోవైపు పలు కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​రావు రిజైన్​ చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్‌‌డీ ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సహా మరికొందరు తమ రాజీనామా లేఖలను సీఎస్‌‌కు పంపించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియెట్ బయట ఉన్న మీడియా సెంటర్‌‌‌‌ను అక్కడి నుంచి తరలించనున్నట్లు తెలిసింది. 

మీడియా సచివాలయం లోపల ఉండాలనే ఉద్దేశంతో.. గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లో మీడియా సెంటర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

నామినేటెడ్ పోస్టులకు రిజైన్లు

కార్పొరేషన్ల చైర్మన్లు సోమవారం తమ రాజీనామా లేఖలను సీఎస్ శాంతి కుమారికి పంపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. సోమ భరత్ కుమార్, జూలూరి గౌరీ శంకర్, పల్లె రవి కుమార్ గౌడ్, ఆంజనేయ గౌడ్, మేడె రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, గూడూరు ప్రవీణ్, గజ్జెల నగేష్, అనిల్ కూర్మాచలం, రామచంద్ర నాయక్, వాల్యా నాయక్, సతీష్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్ సింగ్, జగన్మోహన్ రావు, ఆయాచితం శ్రీధర్, కోలేటి దామోదర్​గుప్తా తదితరులు పదవులకు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. మిగతా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఒకటీ రెండు రోజుల్లో రాజీనామా చేస్తారని బీఆర్ఎస్​వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పదవికి జ్వాల నరసింహారావు రాజీనామా చేశారు.

బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రభాకర్ రావు

ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రభాకర్ రావుపై నేరుగా విమర్శలు చేశారు. రిటైర్డ్ అధికారి అయిన ప్రభాకర్ రావును ట్రాన్స్ కో, జెన్కో కు సీఎండీని చేయడం వల్లే విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎండీ బాధ్యతల నుంచి ఆయనే తప్పుకున్నారు. విద్యుత్‌‌ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే రూ.40 వేల కోట్ల బాకీలు పడ్డాయి. మరో రూ.62 వేల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలకు ఉన్నాయి. అప్పులు తెచ్చి విద్యుత్ సంస్థలను నడపలేని దుస్థితిలో సంస్థలు ఉన్నాయని, ఈ క్రమంలోనే చేతులెత్తేస్తూ ప్రభాకర్ రావు రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

ఏఏజీ రాజీనామా

రాష్ట్రంలో ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌రావు తన పదవికి రాజీనామా చేశారు. చీఫ్‌‌ సెక్రటరీకి రాజీనామా పత్రాన్ని పంపించారు. అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కూడా నేడో రేపో తన పదవికి 
రాజీనామా చేయనున్నారు.

12 మంది సలహాదారులు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 మంది రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగారు. సీఎం ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్‌‌ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. మరో మాజీ సీఎస్ ఎస్.కె. జోషి ప్రస్తుతం ఇరిగేషన్ అడ్వైజర్​గా పనిచేస్తున్నారు. 2012లో రిటైర్ అయిన కె.వి.రమణాచారి ప్రభుత్వ అడ్వయిర్ గా పని చేశారు. పీసీసీఎఫ్ హోదాలో పదవీ విరమణ పొందిన శోభను అదే రోజున అడ్వైజర్‌‌‌‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ ఏ.కే.ఖాన్ కూడా సలహాదారులుగా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్​మెంట్‌‌లో జీఆర్ రెడ్డి, శివశంకర్ (స్పెషల్ ఆఫీసర్లు)గా ఉన్నారు. ఆర్ అండ్ బీకి సుధాకర్ తేజ, ఎనర్జీ సెక్టార్‌‌‌‌కు రాజేంద్ర ప్రసాద్ సింగ్‌‌, హార్టికల్చర్‌‌‌‌కు శ్రీనివాస్ రావు అడ్వైజర్‌‌‌‌గా ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకర్​ రావు

ఇంటెలిజెన్స్‌‌ బ్యూరో ఓఎస్‌‌డీగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ రావు.. ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఓఎస్‌‌డీగా ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే మారిన సమీకరణాల దృష్ట్యా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రభాకర్ రావుపై గతంలో పలుసార్లు రేవంత్‌‌ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  మరోవైపు టాస్క్‌‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌‌ రావు సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎస్‌‌కు తన రాజీనామా లేఖను పంపారు. రాధా కిషన్​ను గత నెలలో ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించింది.