కేసీఆర్​పై మర్డర్ కేసు పెట్టాలె: రేవంత్ రెడ్డి

కేసీఆర్​పై మర్డర్ కేసు పెట్టాలె: రేవంత్ రెడ్డి
  • బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం, 
  • ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ 
  • డీజీపీతో భేటీ.. రవీందర్ కుటుంబానికి పరామర్శ 

హైదరాబాద్, వెలుగు: హోంగార్డు రవీందర్​ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని పీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. సీఎం కేసీఆర్​పై హత్యానేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ పిల్లల చదువు ఖర్చును ప్రభుత్వమే భరించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరామని చెప్పారు. శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్​ను పార్టీ నేతలతో కలిసి రేవంత్ కలిశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవీందర్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్ ​దివాలా తీయించారని, హోంగార్డులకు జీతాలివ్వలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అరెస్ట్ చేసిన హోంగార్డ్ జేఏసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హోంగార్డుల పరిస్థితులపై కేసీఆర్​కు రేవంత్ లేఖ కూడా రాశారు. హోంగార్డుల పరిస్థితి కూలీల కన్నా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. కాగా, ఈ నెల 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో ఏఐసీసీ కీలక నేతలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డీజీపీ అంజనీకుమార్​ను రేవంత్​ కోరారు.

కేసీఆర్​పై కేంద్రం చర్యలేవీ?   

కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ​ప్రశ్నించారు. బీఆర్ఎస్​తో కొట్లాడేటోళ్లకు బీజేపీలో పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్​లో రేవంత్ సమక్షంలో ఆర్మూరు నియోజకవర్గ బీజేపీ నేత ప్రొద్దుటూరి వినయ్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ ​ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిన కేంద్రం.. కేసీఆర్​పై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.  

ఇప్పుడు సిట్టింగులే కాంగ్రెస్​లోకి వస్తున్నరు.. 

గత రెండేండ్ల నుంచి తెలంగాణ కాంగ్రెస్​కు ఏఐసీసీ స్థాయిలో ప్రాధాన్యం పెరిగిందని, అందుకే సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారని రేవంత్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మాట్లాడుతూ, ‘‘నేను పీసీసీ చీఫ్ అయ్యాక మా నాయకుల కోసం కొట్లాడి పదవులు తెస్తున్నాను. నేను పీసీసీ చీఫ్ అయ్యాక అనేక మంది జాతీయ నాయకులు వరుసగా తెలంగాణకు వస్తున్నారు. 

2014 నుంచి 2021 వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయారు. గతంలో సిట్టింగులు పార్టీ నుంచి వెళ్లిపోయేటోళ్లు. ఇప్పుడు సిట్టింగులే కాంగ్రెస్​లోకి వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీభవన్​కు వచ్చి చర్చలు జరిపారు. మళ్లీ నేను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారు’’ అని రేవంత్ అన్నారు.