మొన్న ఓట్ చోరీ..  ఇయ్యాల సీట్ చోరీ!..మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

మొన్న ఓట్ చోరీ..  ఇయ్యాల సీట్ చోరీ!..మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణలో మీనాక్షి​పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని వెల్లడి
  • ఎన్నికల కమిషన్ బీజేపీకి  అనుబంధ సంఘంలా వ్యవహరిస్తోంది: మహేశ్ గౌడ్
  • పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రులు 

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌‌‌‌ను మధ్యప్రదేశ్​లో ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ బీజేపీ చేసిన రాజకీయ కుట్ర అని సీఎం మండిపడ్డారు. దేశంలో ఇప్పటికే ‘ఓట్ చోరీ’, ‘సర్’ వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన బీజేపీ.. ఇప్పుడు ‘సీట్ చోరీ’కి తెరలేపిందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌‌‌‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని.. అయినా, గెలవలేమనే భయంతోనే కుట్రపూరితంగా ఆమె నామినేషన్‌‌‌‌ను తిరస్కరించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్‌‌‌‌ను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజల గొంతు నొక్కేలా జరిగిన ఈ దాడి భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక 'చీకటి రోజు' అని, దీనిపై న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన రిలీజ్​ చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది: పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్  

కేంద్రంలోని అధికార బీజేపీ ఒక్కొక్క కుట్ర చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తోందని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్  మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌ తిరస్కరణ.. బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. గెలవలేమనే భయంతో, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

చివరకు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ సైతం స్వతంత్రతను కోల్పోయి, పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంఘంలా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర పెద్దల కనుసన్నల్లోనే ఈ నామినేషన్ తిరస్కరణ పర్వం నడిచిందన్నారు. బీజేపీ అధికార బలంతో సాగిస్తున్న ఈ తరహా నిరంకుశ, రాజకీయ కుట్రలను దేశ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారని మహేశ్​గౌడ్​హెచ్చరించారు.  

బీజేపీ భయానికి నిదర్శనం: మంత్రులు

మీనాక్షి నటరాజన్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే బలమైన గొంతుక అని, ఆమె సభలోకి వస్తే తమ వైఫల్యాలను నిలదీస్తారనే భయంతోనే బీజేపీ ఈ హేయమైన చర్యకు ఒడిగట్టిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, సీతక్క ఇతర  రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ.. ఇలా అక్రమ మార్గాల ద్వారా జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రతి పౌరుడికి, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంటుందని, దాన్ని హరిస్తే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులందరూ ఈ చర్యను ఖండించాలని పిలుపునిచ్చారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటోందని మంత్రులు విమర్శించారు.  ఈ ఘటనలో పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రులు పేర్కొన్నారు.