పల్లా, ముత్తిరెడ్డి బాగోతాలు గడీలోని దొరకు తెలుసు : రేవంత్ రెడ్డి

పల్లా, ముత్తిరెడ్డి బాగోతాలు గడీలోని దొరకు తెలుసు : రేవంత్ రెడ్డి

జనగామలో జన సందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లు ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. పొన్నాల లక్ష్మయ్య లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నా కానీ.. ఇక్కడి జనాలను చూశాక తనకు ధైర్యం వచ్చిందన్నారు. కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొడుతామని ఇక్కడి ప్రజలు సభకు వచ్చి నిరూపించారని చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పారని అన్నారు. 

పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతాలు గడీలో ఉన్న దొరకు (కేసీఆర్) తెలుసన్నారు. జనగామ ప్రాంతంలోని మట్టికి ఒక పౌరుషం ఉందన్నారు. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిదని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య.. కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా..? అని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి.. పొన్నాల శత్రువు పంచన చేరాడని మండిపడ్డారు. అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్ పంచన చేరాడని అన్నారు. 

also read :- బీఆర్ఎస్కి కోవర్టుగా చిక్కడపల్లి ఏసీపీ : అంజన్ కుమార్

జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి అని సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్ లోకి కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదన్నారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది లేకుంటే ఏంది అని చెప్పారు.