
- మా పార్టీ నుంచి ఇద్దరు వస్తరు..దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావాలి
- రాహుల్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కాగ్ నివేదికపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తమ పార్టీ తరఫున చర్చకు ఇద్దరం హాజరవుతామని, బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు. తప్పు ఉందని నిరూపిస్తే, బీఆర్‌ఎస్ విధించే శిక్షకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు మొదలుపెడితే, రీడిజైన్ పేరిట ప్రాజెక్ట్ ఖర్చును రూ.1.49 లక్షల కోట్లకు కేసీఆర్ పెంచారని తెలిపారు. ఈ రీడిజైన్ వల్ల ఒక్క ఎకరా ఆయకట్టు కూడా అదనంగా పెరగలేదన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.85 వేల కోట్లను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని రేవంత్ తెలిపారు. ఇవికాకుండా ఏటా రూ. 25 వేల కోట్లు నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. ఈ లెక్కన ఎకరాకు ఏడాదికి రూ. 45 వేలు నీళ్ల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ విషయాలన్నీ కాగ్ నివేదికలో ఉన్నాయని, చిత్తశుద్ధి ఉంటే కాగ్ నివేదికపై హరీశ్, కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ చాలెంజ్ చేశారు.
నక్క తప్ప.. వేటకుక్కలన్నీ మొరుగుతున్నయ్
జనగర్జన సభకు ప్రజలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసిందని రేవంత్ మండిపడ్డారు. ‘‘అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి సభకు రాకుండా జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా, అన్ని కుట్రలను ఛేదించి తెలంగాణ జనగర్జన సభను ఖమ్మం ప్రజలు, లీడర్లు విజయవంతం చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. కాంగ్రెస్ సభ సక్సెస్ కావడంతో అసలు నక్క తప్ప, వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలుపెట్టినయ్. ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నరు. రాహుల్ గాంధీది మీలా దోపిడీ కుటుంబం కాదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కుమారుడు. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్. దేశంలో రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉందో బీఆర్‌ఎస్ చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మీరు అంటకాగుతున్న నరేంద్ర మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? అసలు రాహుల్‌ను విమర్శించడానికి మీకున్న అర్హత ఏమిటి? ట్విట్టర్ పిట్ట, సారా సీసాలో సోడా కలిపేటోడు సహా మంత్రులు ప్రతి ఒక్కరూ రాహుల్ అర్హతపై ప్రశ్నిస్తున్నరు. భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతుండు. అసలు కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్ అర్హత గురించి ప్రశ్నించరు” అని రేవంత్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కాంగ్రెస్ నెరవేర్చిందని, రూ.4 వేల పింఛన్ హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రాష్ట్ర ఆదాయం పెరిగినందున పింఛన్ పెంచడం కష్టమేమీ కాదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛన్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్ తోసిపుచ్చారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలకు తగ్గట్టుగా అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. కర్నాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉన్న చాలా పథకాలు తెలంగాణలో లేవని తెలిపారు.
ఆస్తులు ఎట్ల పెరిగినయ్?
తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగాయని రేవంత్ ఆరోపించారు. 2014 జూన్ 2న కేసీఆర్ కుటుంబం ఆస్తులు, ప్రస్తుతం వారి కుటుంబం ఆస్తుల లెక్కపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో కల్వకుంట్ల కుటంబం సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. “ఎట్ హోం కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. తొలుత ఈ కంపెనీలో కల్వకుంట్ల కవిత భర్త, జోగినిపల్లి సంతోష్ రావు డైరైక్టర్లుగా ఉన్నారు. తర్వాత ఈ కంపెనీలో కల్వకుంట్ల శైలిమ, తేలుకుంట్ల శ్రీధర్ డైరెక్టర్లుగా చేరారు. ఐటీ తర్వాత ఈడీ వస్తుందనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈడీ అమిత్ షా పరిధిలోకి వస్తుంది. ఇందుకు కాకుంటే ఏ అభివృద్ధి కోసం కలిశారో, ఏ వినతి పత్రాలు సమర్పించారో వాటిని బయటపెట్టాలి” అని రేవంత్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలను మెడపట్టి బయటకు గెంటేస్తం
బీఆర్‌ఎస్‌తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ వేదికనూ పంచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఇది తమ పార్టీ విధానమని ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. త్వరలో బెంగళూరులో జరగబోయే ప్రతిపక్షాల సభకు కూడా బీఆర్ఎస్ను రానివ్వబోమన్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్ నేతలు ఎవరైనా వస్తే, మెడలు పట్టి బయటకు గెంటేస్తామని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందని, బీఆర్‌ఎస్ కూడా వాళ్ల విధానమేంటో చెప్పుకోవాలన్నారు.