కరెంటు కోసం మరో బషీర్ బాగ్ ఉద్యమం : రేవంత్ రెడ్డి

కరెంటు కోసం మరో బషీర్ బాగ్ ఉద్యమం : రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు ఇచ్చిన గడువు ముగిసిందని వచ్చే ఎన్నికల్లో ఆయనను సాగనంపడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన కేసీఆర్ పాలనపై ఫైర్ అయ్యారు. 2003కు ముందు ఉన్నట్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని ఆరోపించారు. రైతులకు 24గంటల విద్యుత్ పై ఆడంబరపు ప్రకటన చేసిన కేసీఆర్.. అమలులో మాత్రం వెనకడుగువేసిండని విమర్శించారు . ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50శాతం కమీషన్లు దండుకున్న ముఖ్యమంత్రి ట్రాన్స్ కో, జెన్ కో రూ.60వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. 

విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మిగులు విద్యుత్ను తక్కువ ధరకే సరఫరా చేసేందుకు ఏపీ ముందుకొచ్చినా.. సీఎం మాత్రం కమీషన్లు, కాసుల కక్కుర్తితో తన నమ్మిన బంట్ల వద్ద కొనుగోలు చేశారని అన్నారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందన్న అధికారును బదిలీ చేశారని చెప్పారు. గుజరాత్ కంపెనీ నుంచి వెయ్యి కోట్ల లంచం తీసుకుని కాలం చెల్లినటెక్నాలజీని కొన్నారని, సివిల్ వర్క్ ను సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించి వేల కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్ కు అప్పగిస్తే తొమ్మిదేళ్లైనా అది పూర్తి కాలేదని రేవంత్ విమర్శించారు2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కరెంటు కోసం మరోసారి బషీర్ బాగ్ లాంటి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులు దోపిడీదారులపక్షాన ఉంటారో, ప్రజల పక్షాన కొట్లాడుతారో నిర్ణయించుకోవాలని అన్నారు.