
- ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని మేం చెప్పింది నిజం: రేవంత్
- కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్నరని మోదీనే చెప్పారు
- కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్మధ్య ఉన్నది ఫెవికాల్బంధమన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్సభ సాక్షిగా స్పష్టం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్ చీకటి మిత్రులని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లిలో కుస్తీ అంటూ తాము ముందు నుంచీ చెప్తూనే ఉన్నామని, అదిప్పుడు మోదీ మాటలతో నిజమని తేలిందని అన్నారు. ‘‘కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్నది నిజం. మోదీ ఆశీస్సులతో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నది నిజం. ఇప్పటికీ మోదీ, కేసీఆర్‌లు చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం. నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా నిగ్గుతేలక మానదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్బంధాన్ని అర్థం చేసుకోవాలి. గడచిన 9 ఏండ్లలో మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కేసీఆర్ మద్దతు ఉన్నదన్నది పార్లమెంట్రికార్డులే చెబుతాయి. కేసీఆర్ఢిల్లీ వెళ్లి చీకట్లో మోదీతో ఏమేం లాలూచీలు పడ్డారో మోదీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆ రెండు పార్టీల చీకటి బంధాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
కులగణన చేయాలని కేసీఆర్‌కు లేఖ
బీహార్రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దక్కాల్సిన వాటా దక్కాలంటే కుల గణన అత్యావశ్యకమన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలనూ బయటపెట్టాలన్నారు. కులగణనపై మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇండియా కూటమిలో భాగమైన జేడీయూ చీఫ్నితీశ్కుమార్.. బీహార్‌లో కులగణన చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. బీసీలకు ఎంతో చేశామని చెప్పుకుంటున్నా.. చేసింది మాత్రం శూన్యమేనన్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పినా.. అది ఉత్త ముచ్చటగానే మిగిలిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేవలం 20 సీట్లే ఇచ్చి రాజకీయంగానూ బీసీలను అణగదొక్కాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అరుదైన పక్షులు, జంతువుల జాతులను రక్షించడానికి ప్రభుత్వాలు వాటి లెక్కలు తీస్తున్నా.. దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభా మాత్రం ఎంతో తెలియట్లేదని ప్రశ్నించారు. బీసీల జనాభా ఎంతుందో తెలుసుకునేందుకు నేటికీ బ్రిటీష్ హయాంలో జరిగిన జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవడం దురదృష్టకరమన్నారు. దీంతో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వారికి న్యాయం జరగాలంటే కనీసం రాష్ట్రంలోనైనా కులగణనను చేపట్టాలని రేవంత్డిమాండ్ చేశారు. ఆర్టికల్15, 16 ప్రకారం విద్య, ఉద్యోగాల్లో బీసల రిజర్వేషన్‌ను అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు.