ఫాం హౌస్ ఫైల్ సీబీఐకు ఇయ్యాలె : రేవంత్ రెడ్డి

ఫాం హౌస్ ఫైల్ సీబీఐకు ఇయ్యాలె : రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : ఫాం హౌజ్ కేసు​ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐకి అప్పగించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఫామ్ హౌస్ కేసుకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల ఫైల్ను  సీబీఐకి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పినపాకలో చందాలు వేసుకుని కాంగ్రెస్ పార్టీ బిల్డింగు కట్టుకుంటే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దాన్ని కబ్జా చేయడం దారుణమని రేవంత్ ఫైర్​అయ్యారు. బిల్డింగులు పార్టీకి అప్పగించకపోతే రేగాకు గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ అన్నారు.  పార్టీలో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని చెప్పారు.  ధరణి ప్రమాదకరమైన వ్యవస్థ అన్న రేవంత్.. అనేక జిల్లాల్లో లిటిగేషన్ భూములు కోకొల్లలుగా ఉన్నాయని, ఆ రికార్డులన్నీ తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో ఆయా కలెక్టర్ల కార్యాలయాల్లోనూ షార్ట్ సర్క్యూట్ జరిగి,  రికార్డులు గోల్ మాల్ అవుతాయని జోస్యం చెప్పారు. పోడు సమస్య కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించగలదని, గతంలో ఆ భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టు రాజకీయాలకు త్వరలోనే చెక్ పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.