
హైదరాబాద్, వెలుగు: ‘‘రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ కేసీఆర్ తన ఓటమిని తానే ఒప్పుకున్నడు. గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతో కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నడు. కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదు” అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రెండో నియోజకవర్గంగా సిద్దిపేటనో, సిరిసిల్లనో ఎంచుకోకుండా ఓ మైనార్టీ లీడర్ ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవడం మైనార్టీలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
‘‘కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు చూశాక ఈసారి కాంగ్రెస్‌దే విజయం అని అర్థమైంది. మూడింట రెండొంతుల సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం మధ్యాహ్నం 12.03 గంటలకు అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తానని చెప్పి, ఆ సమయంలో వైన్స్ టెండర్లు ఓపెన్ చేయించిండు. దీన్ని బట్టి కేసీఆర్ ప్రాధాన్యం ఏందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
చర్చకు మేం సిద్ధం
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏంచేసిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ సవాల్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదన్న కేసీఆర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రో, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు, ప్రతి పల్లెకూ కరెంట్ కనెక్షన్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని తెలిపారు.
జేబీఎస్, ఎంజీబీఎస్, కాచిగూడ, గౌలీగూడ వంటి రద్దీ ప్రాంతాలకు తాము మెట్రో వేస్తే, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కేసీఆర్ మెట్రో వేస్తానంటున్నారని విమర్శించారు. ‘‘పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్సే. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్సే. 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో పాటు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నం. కేసీఆర్‌కు దమ్ముంటే 23 లక్షల కోట్లతో ఈ పదేండ్లలో ఏం చేశారో లెక్కలతో చర్చకు రావాలి” అని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయని కేసీఆర్ అంటున్నారని, మరి రైతు బంధును మూడు పంటకు ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
డబ్బు, మందు పంచబోమని ప్రమాణం చేయాలి
ఐఆర్బీ(ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్ట్ సంస్థ) ఇచ్చిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారని రేవంత్ ఆరోపించారు. ‘‘అమెరికా వెళ్లేందుకు ఉన్న సమయం, వరద బాధితులను పరామర్శించడానికి లేదా? డబ్బు, మందు పంచకుండా ఓట్లు అడిగేందుకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధంగా ఉన్నరా? ఇందుకు సిద్ధమైతే యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడానికైనా, నాంపల్లి దర్గా వద్ద ప్రమాణం చేయడానికైనా రావాలి” అని సవాల్ చేశారు.
కేసీఆర్‌కు అమరుల కుటుంబాలపై కనీస గౌరవం లేదని, ఆదివారం జరిగిన సూర్యాపేట సభలో శ్రీకాంతాచారి తల్లిని నిలబెట్టి అవమానించారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేయడానికి ముందు, ఇక్కడ కేసీఆర్‌ను నిలదీయాలని రేవంత్ అన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలని ఆయన సూచించారు.