
న్యూఢిల్లీ: కొకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని సీబీఐ డైరెక్టర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కొకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతామని ఆయన అన్నారు. గురువారం ఉదయం ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన రేవంత్.. కోకాపేట, ఖానామెట్ భూముల టెండర్లో జరిగిన గోల్‌మాల్‌పై ఫిర్యాదు చేశారు.
‘కొకాపేట భూములను, తెలంగాణ జాతి సంపదను కేసీఆర్ తన బంధువులకు, కావాల్సిన వారికి కట్టబెట్టారు. కోకాపేట భూములను 2500 కోట్లకు అమ్మామని చెప్తున్నారు. అలా అమ్మడం వల్ల 1500 కోట్ల నష్టం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ని కలిసి.. రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగింది.
కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టి.. రాజకీయాలను కలుషితం చేసి.. అవినీతికి పాల్పడి, ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారు. తనకు కావాల్సిన గుప్పెడు మంది కొరకు తెలంగాణ సందపను కేసీఆర్ దోచిపెడుతున్నాడు. కొకాపేట, ఖానామేట్ భూముల టెండర్లో గోలుమాలు జరిగింది. దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, సిద్ధిపేట కలెక్టర్ వెంకటారామిరెడ్డిపై సీబీఐ డైరెక్టర్‌కి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశాను. మై హోమ్ సంస్థ, రాజ్ పుష్ప సంస్థ, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష లబ్ధిదారులు. అందుకే వారిపై కూడా పిర్యాదు చేశాను.
బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని.. తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని, జైలుకి పంపిస్తామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కనీసం కేసీఆర్ మీద విచారణకు అదేశించాలని ప్రధాని, హోంమంత్రి, ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు కానీ ఫిర్యాదు చేయడం లేదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్టంలో జరిగిన అవినీతిపై విచారణకు అదేశించాలని మోడీ, అమిత్ షాలని కోరాలని బండి సంజయ్, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న. పాదయాత్రలు చేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్‌తో కుమ్మక్కు కాకపోతే.. మేం చేసిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అడగండి. కేసీఆర్ అవినీతిపై ప్రధానికి, హోమంత్రికి ఫిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ దొరకడం లేదా? బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ నిజాయితీ, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’ అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.