- వైఎస్ పేరును రేవంత్‌రెడ్డి చెడగొడుతుండు
- మాజీమంత్రి జీవన్‌రెడ్డి తొందరపడి పార్టీ మారుతుండు
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
కోరుట్ల, వెలుగు : ‘రేవంత్‌రెడ్డి ఫండింగ్‌తోనే కవిత కొత్త పార్టీ పెడుతుంది, బీజేపీని అణగదొక్కేందుకే కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నరు, రేవంత్‌రెడ్డి వైఎస్ టూ అని చెప్పుకుంటూ ఆయన పేరు చెడగొడుతుండు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గురువారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేదని, ఇప్పుడు ఆ రెండూ అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వనందునే.. ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్రం పంపిన రూ.206 కోట్లు రిటర్న్ పోయాయన్నారు.
మాజీమంత్రి జీవన్‌రెడ్డి తొందరపడి పార్టీ మారుతున్నారన్నారు. ‘జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎక్కడ ఉంటే అక్కడ శని ఉంటుంది, కాంగ్రెస్‌లోకి పోలేదని చెబుతూ ఆ పార్టీలో కొనసాగుతున్నాడు, బీఆర్ఎస్‌లో ఉండి డాక్టర్ భోగ శ్రావణిని బయటకు పంపించాడు, కాంగ్రెస్‌లో చేరి జీవన్‌రెడ్డిని సాగనంపాడు’ అని ఎద్దేవా చేశారు. జీవన్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని, కానీ ఆయన నుంచి స్పందన రాలేదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పసుపు బోర్డుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
ఇక్కడి పసుపు రైతులకు రూ. రూ.16,500 గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని చెప్పుకొనే సంజయ్... కేంద్రీయ విద్యాలయానికి ఎందుకు స్థలాన్ని ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రూ.లక్ష కోట్ల అప్పులు పెరిగాయని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, నాయకులు డాక్టర అనూప్‌రావు, రుద్ర శ్రీనివాస్, ఇందూరి తిరుమలవాసు, కస్తూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
